Mokkajonna Garelu : మనం ఆహారంగా తీసుకునే వాటిల్లో మొక్కజొన్న కంకులు కూడా ఒకటి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటూ ఉంటారు. ఇవి ఎన్నో పోషకాలను కలిగి ఉంటాయి. మొక్కజొన్న కంకులను తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. మన శరీరానికి కావల్సిన విటమిన్స్, మినరల్స్ మొక్కజొన్న కంకులలో పుష్కలంగా ఉంటాయి. వీటిని తరచూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉండడం వల్ల రక్త హీనత సమస్య తగ్గుతుంది. షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది.
త్వరగా బరువు తగ్గడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. జీర్ణశక్తిని పెంచడంలో, కంటి చూపును మెరుగుపరచడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. రక్తాన్ని, రక్త నాళాలను, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఇవి దోహదపడతాయి. చాలా మంది మొక్కజొన్న కంకులను ఉడికించి లేదా కాల్చుకుని తింటుంటారు. ఈ విధంగానే కాకుండా మొక్కజొన్న గింజలతో ఎంతో రుచిగా ఉండే గారెలను కూడా తయారు చేసుకోవచ్చు. మొక్క జొన్న గారెలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. మొక్కజొన్న కంకులతో గారెలను ఎలా తయారు చేసుకోవాలి.. వాటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మొక్క జొన్న గారెల తయారీకి కావల్సిన పదార్థాలు..
మొక్క జొన్న గింజలు – రెండు కప్పులు, వెల్లుల్లి రెబ్బలు – 5, తరిగిన ఉల్లిపాయ – 1, పచ్చి మిర్చి – 8 నుండి 10, ఉప్పు – తగినంత, తరిగిన కరివేపాకు – 2 రెబ్బలు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
మొక్కజొన్న గారెల తయారీ విధానం..
మొక్కజొన్న గారెలను తయారు చేయడానికి గాను ఒక జార్ లో లేదా గ్రైండర్ లో మొక్క గింజలు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన ఉల్లిపాయ, పచ్చి మిర్చి, ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిలో జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి నూనె కాగిన తరువాత పిండిని కావల్సిన పరిమాణంలో తీసుకుని గారెలుగా చేసి నూనెలో వేసి రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. అనంతరం వాటిని ప్లేట్‌లోకి తీసుకోవాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే మొక్కజొన్న గారెలు తయారవుతాయి.
మొక్కజొన్న గింజలలో పంచదార లేదా బెల్లాన్ని వేసి మనం తియ్యటి గారెలను కూడా తయారు చేసుకోవచ్చు. తరచూ మనం మొక్కజొన్న కంకులను కాల్చుకుని లేదా ఉడికించుకుని లేదా గింజలను వేయించుకుని తింటూ ఉంటాం. వీటితోపాటు మొక్కజొన్న గింజలతో ఇలా గారెలను తయారు చేసుకుని తినడం వల్ల రుచిగా ఉండడంతోపాటు మొక్కజొన్న కంకులను తినడం వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.