Aloo 65 : మనం ఆహారంగా తీసుకునే దుంప జాతికి చెందిన వాటిల్లో బంగాళాదుంప కూడా ఒకటి. ఇది మనందరికీ తెలిసిందే. దీనిని తినడం వల్ల మన శరీరానికి మేలు కలుగుతుందన్న విషయం కూడా మనకు తెలుసు. మూత్ర పిండాలలో రాళ్లు ఏర్పడకుండా చేయడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, కాలేయాన్ని శుభ్రపరచడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కూడా మనం బంగాళాదుంపలను ఉపయోగిస్తూ ఉంటాం.
బంగాళాదుంపలతో కూరలనే కాకుండా చిరు తిళ్లను కూడా తయారు చేస్తుంటారు. బంగాళాదుంపలతో చేసే చిరుతిళ్లు అనగానే అందరికి ముందుగా చిప్స్ గుర్తుకు వస్తాయి. చిప్స్ మాత్రమే కాకుండా బంగాళాదుంపలతో ఇతర చిరుతిళ్లను కూడా తయారు చేసుకోవచ్చు. వీటితో మనం ఆలూ 65 ని తయారు చేసుకోవచ్చు. ఇది మనకు బయట ఎక్కువగా దొరుకుతుంటుంది. మనం ఇంట్లో చాలా సులువుగా ఆలూ 65 ని తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఆలూ 65 ని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ 65 తయారీకి కావల్సిన పదార్థాలు..
బంగాళాదుంపలు – అర కిలో, మైదా పిండి – 2 టేబుల్ స్పూన్స్, బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, నీళ్లు – తగినన్ని, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా, చిన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు – 4, ఎండు మిర్చి – 2, పొడుగ్గా తరిగిన పచ్చి మిర్చి – 3, కరివేపాకు – రెండు రెబ్బలు, ఉండలు లేకుండా కలిపిన పెరుగు – అర కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఆలూ 65 తయారీ విధానం..
ముందుగా ఒక కుక్కర్ లో లేదా గిన్నెలో బంగాళాదుంపలను వేసి తగినన్ని నీళ్లు పోసి మరీ మెత్తగా కాకుండా బంగాళాదుంపలపై ఉండే పొట్టు వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత బంగాళాదుంపలపై ఉండే పొట్టును తీసి కావల్సిన పరిమాణంలో ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో మైదా పిండి, బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లను పోసుకుంటూ బజ్జీ పిండిలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను వేసి బాగా ముక్కలకు పిండి పెట్టేలా కలుపుకోవాలి.
ఇప్పుడు కళాయిలో నూనె పోసి నూనె వేడయ్యాక పిండి పట్టేలా కలుపుకున్న బంగాళాదుంప ముక్కలను వేసి మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మరో కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె వేడయ్యాక తరిగిన వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, కరివేపాకును ఒక దాని తరువాత ఒకటి వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత పెరుగును కొద్దిగా, ఉప్పును వేసి కలిపి చిన్న మంటపై 2 రెండు నిమిషాల పాటు ఉంచి ముందుగా వేయించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను వేసి కలిపి మరో 3 నిమిషాల పాటు ఉంచి చివరగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ 65 తయారవుతుంది. సాయంత్రం సమయాలలో స్నాక్స్ గా చేసుకోవడానికి ఈ వంటకం చాలా బాగుంటుంది. ఆలుగడ్డలతో తరచూ చేసే వంటలనే కాకుండా ఇలా ఆలూ 65 ని కూడా తయారు చేసుకుని తినవచ్చు.