Onion Samosa : మనకు బయట హోటల్స్, బండ్ల మీద లభించే చిరుతిళ్లల్లో సమోసాలు కడా ఒకటి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిని ఎంతో కాలంగా మనం స్నాక్స్ గా తయారు చేసుకుని తింటూ ఉన్నాం. ఈ సమోసాలు మనకు వివిధ రుచుల్లో లభిస్తూ ఉంటాయి. వాటిల్లో ఆనియన్ సమోసా కూడా ఒకటి. ఈ సమోసాలు చాలా రుచిగా ఉంటాయి. బయట లభించే విధంగా ఉండే ఆనియన్ సమోసాలను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. రుచిగా కరకరలాడుతూ ఉండేలా ఆనియన్ సమోసాలను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆనియన్ సమోసా తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉల్లిపాయలు – 300 గ్రా., మైదాపిండి – ఒక కప్పు, ఉప్పు – తగినంత, గోరు వెచ్చని నీళ్లు – తగినన్ని, కారం – అర టీ స్పూన్, గరం మసాలా పొడి – పావు టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
ఆనియన్ సమోసా తయారీ విధానం..
ముందుగా ఉల్లిపాయలను తరిగి ఒక వస్త్రంపై వేసి ఒక గంట పాటు ఆరబెట్టాలి. తరువాత ఒక గిన్నెలో మైదాపిండి, పావు టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. పిండి మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి. తరువాత ఈ పిండిని సమ భాగాలుగా చేసుకుని పొడి పిండి చల్లుకుంటూ వీలైనంత పలుచగా చపాతీలుగా వత్తుకోవాలి. ఇలా వత్తుకున్న వాటిని వేడి పెనం మీద వేసి 10 సెకన్లలో రెండు వైపులా కాల్చుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇలా అన్నింటని కాల్చుకున్న తరువాత ఒక దాని మీద ఒకటి వేసి అంచులను కట్ చేసుకోవాలి.
తరువాత దీర్ఘ చతురస్రాకారంలో పట్టీలుగా ఈ షీట్ లను కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఉల్లిపాయలను తీసుకుని అందులో ఉప్పు, కారం, గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పావు కప్పు మైదా పిండిని తీసుకుని అందులో నీటిని పోసి పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన ఒక్కో పట్టీని తీసుకుని సమోసా ఆకారంలో చుట్టుకోవాలి. తరువాత ఇందులో ముందుగా తయారు చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని ఉంచాలి. వీటి చివర్లకు మైదా పిండి పేస్ట్ రాసి అంచులను మూసి వేసుకోవాలి. ఇలా అన్ని సమోసాలను తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక సమోసాలను వేసి కాల్చుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆనియన్ సమోసా తయారవుతుంది. సాయంత్రం సమయాల్లో ఈవిధంగా ఆనియన్ సమోసాలను తయారు చేసుకుని తినవచ్చు. వీటిని ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.