Orange Sharbat : వేసవిలో చల్లని పానీయాలను సేవించడం వల్ల మనకు ఎంతగానో ఉపశమనం లభిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి పానీయాల్లో మనం ఆరోగ్యకరమైనవి ఎంచుకోవాలి. అప్పుడే ఎలాంటి హాని కలగకుండా ఉంటుంది. పైగా పోషకాలు కూడా లభిస్తాయి. దీంతో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందుతూనే మరోవైపు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఇక అలాంటి ఆరోగ్యకరమైన పానీయాల్లో నారింజ షర్బత్ కూడా ఒకటి. దీన్ని తయారు చేయడం చాలా సులభం. దీన్ని రోజూ తాగితే ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడంతోపాటు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నారింజ షర్బత్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నారింజలు – 1 కిలో, చక్కెర – పావు కప్పు, ఉప్పు – పావు టీస్పూన్, నీళ్లు – తగినన్ని, సబ్జా గింజలు – 2 టీస్పూన్లు.
నారింజ షర్బత్‌ను తయారు చేసే విధానం..
నారింజ పండ్ల తొక్కను తీసేసి లోపలి విత్తనాలను, మీద ఉండే పొట్టును తీయాలి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. అనంతరం వాటిని ఒక బ్లెండర్ జార్‌లోకి తీసుకోవాలి. తరువాత వాటిలో చక్కెర, ఉప్పు వేసి కలిపి స్మూత్ మిశ్రమం వచ్చే వరకు మిక్సీ పట్టాలి. అనంతరం జ్యూస్‌ను వడకట్టాలి. తరువాత ఆ జ్యూస్‌ను ఒక పాత్రలోకి తీసుకోవాలి. దాన్ని ఒక గంట పాటు లేదా కావల్సినంత చల్లదనం వచ్చే వరకు ఫ్రిజ్‌లో పెట్టాలి. తరువాత అందులో అవసరం అనుకుంటే మరింత చక్కెర, ఉప్పు కలుపుకోవచ్చు. అలాగే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. చివరకు అందులో సబ్జా గింజలను వేసి కలపాలి.
దీంతో నారింజ షర్బత్ రెడీ అవుతుంది. దీన్ని అలాగే తాగేయవచ్చు. అయితే సబ్జా గింజలు కాసేపు నానితే తెల్లగా మారుతాయి. కనుక కాసేపు ఆగి కూడా షర్బత్‌ను తీసుకోవచ్చు. దీంతో ఎంతో రుచికరమైన నారింజ షర్బత్‌ను ఆస్వాదించవచ్చు. దీన్ని మధ్యాహ్నం సమయంలో తాగితే వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరం చల్లగా మారుతుంది. వేడి తగ్గుతుంది. డీహైడ్రేషన్ నుంచి బయట పడవచ్చు. ఎండదెబ్బ తగలకుండా ఉంటుంది.