Ivy Gourd Fry : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో దొండకాయ కూడా ఒకటి. ఇతర కూరగాయల వలె దొండకాయలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. దొండకాయలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. దొండకాయలతో చేసే ఏ వంటకమైన చాలా రుచిగా ఉంటుంది. వీటితో ఎక్కువగా వేపుడును తయారు చేస్తూ ఉంటారు. దొండకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. తరచూ చేసే దొండకాయ వేపుడుతో పాటు కింద చెప్పిన విధంగా వేసే దొండకాయ వేపుడు కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. మరింత రుచిగా దొండకాయ వేపుడును ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దొండకాయ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
దొండకాయలు – 300 గ్రా., నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 3, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, ఎండు కొబ్బరి పొడి – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
దొండకాయ ఫ్రై తయారీ విధానం..
ముందుగా దొండకాయలను శుభ్రంగా కడిగి గుండ్రటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. తరువాత దొండకాయ ముక్కలు వేసి పెద్ద మంటపై 2 నిమిషాల పాటు వేయించాలి. తరువాత మంటను మధ్యస్థంగా చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. తరువాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ముక్కలు మెత్తబడే వరకు వేయించాలి.
దొండకాయ ముక్కలు మెత్తబడిన తరువాత మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి కలపాలి. ఈ ముక్కలను మరో రెండు నిమిషాల పాటు వేయించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దొండకాయ ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో తినవచ్చు. అలాగే పప్పు, సాంబార్ వంటి వాటితో కూడా తినవచ్చు. దొండకాయలను తినని వారు ఈ విధంగా చేసిన ఫ్రైను ఇష్టంగా తింటారు.