Pachi Batani Pulao : మనం పచ్చి బఠాణీ కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వివిధ రకాల వంటకాల్లో వీటిని విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. పచ్చి బఠాణీలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బరువు తగ్గడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తి పెండచంలో, వృద్ధాప్య ఛాయలు దరి చేరకుండా చేయడంలో, జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో, కంటి చూపును పెంచడంలో ఈ విధంగా పచ్చి బఠాణీలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వివిధ వంటకాల్లో వాడడంతో పాటు ఈ పచ్చి బఠాణీలతో మనం ఎంతో రుచిగా ఉండే పులావ్ ను కూడా తయారు చేసుకోవచ్చు. పచ్చి బఠాణీలతో చేసే పులావ్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. పచ్చి బఠాణీలతో పులావ్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి బఠాణీ పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన బాస్మతీ బియ్యం – 3 టీ గ్లాసులు, నీళ్లు – 6 టీ గ్లాసులు, నెయ్యి – 2 టీ స్పూన్స్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు – కొద్దిగా, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్క – 1 ( పెద్దది), తరిగిన పచ్చిమిర్చి – 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టేబుల్ స్పూన్, పచ్చి బఠాణీ – ఒక టీ గ్లాస్, పుదీనా ఆకులు – అర కప్పు, తరిగిన కొత్తిమీర – అర కప్పు, ఉప్పు- తగినంత, గరం మసాలా – ఒక టీ స్పూన్.

మసాలా దినుసులు..
బిర్యానీ ఆకులు – 2, సాజీరా – ఒక టీ స్పూన్, యాలకులు – 4, లవంగాలు – 4, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, మరాఠీ మొగ్గలు – 2, అనాసపువ్వు – 2, జాప్రతి – 1.
పచ్చి బఠాణీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీడిపప్పు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తరువాత అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత పచ్చి బఠాణీ, పుదీనా ఆకులు, కొత్తిమీర వేసి వేయించాలి. పచ్చి బఠాణీ సగం వేగిన తరువాత ఉప్పు, గరం మసాలా వేసి కలపాలి. నానబెట్టుకున్న బియ్యం, నీళ్లు పోసి కలపాలి. అంతా కలిసేలా కలిపిన తరువాత మూత పెట్టి మధ్యస్థ మంటపై దగ్గర పడే వరకు ఉడికించాలి. దగ్గర పడిన తరువాత మంటను చిన్నగా చేసి పూర్తిగా తడి పోయే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పచ్చి బఠాణీ పులావ్ తయారవుతుంది. దీనిని రైతాతో పాటు మసాలా కూరలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా పచ్చి బఠానీతో పులావ్ ను ఇంట్లో అందరూ ఇంకా కావాలని అడిగి మరీ ఇష్టంగా తింటారు.