Palak Pakoda : మనం సాయంత్రం సమయాల్లో రకరకాల చిరుతిళ్లు తయారు చేస్తూ ఉంటాం. వాటిల్లో పకోడీలు కూడా ఒకటి. పకోడీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. మనం మన రుచికి తగినట్టు రకరకాల పకోడీలు తయారు చేస్తూ ఉంటాం. మనం తయారు చేసే వివిధ రకాల పకోడీలల్లో పాలక్ పకోడాలు కూడా ఒకటి. పాలకూర వేసి చేసే ఈ పకోడాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా తేలిక. రుచిగా, కరకరలాడుతూ ఉండేలా సులభంగా పాలకూరతో పకోడీలను ఎలా తయారు చేసుకోవాలి…అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పాలక్ పకోడా తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన పాలకూర – 2 పెద్ద కట్టలు, శనగపిండి – 200 గ్రా., బియ్యం పిండి – 100 గ్రా., తరిగిన పచ్చిమిర్చి – 4, కారం – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, జీలకర్ర – ఒక టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
పాలక్ పకోడా తయారీ విధానం..
ముందుగా గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో పాలకూర, నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని పకోడి పిండి కంటే కొద్దిగా పలుచగా కలుపుకోవాలి. తరువాత ఇందులో పాలకూర వేసి కలపాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తగినంత పిండిని తీసుకుంటూ పకోడీలా వేసుకోవాలి. ఈ పకోడీలను మధ్యస్థ మంటపై కరకరలాడే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పాలక్ పకోడాలు తయారవుతాయి.వీటిని టమాట కిచప్ తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా తినడానికి ఈ పకోడాలు చాలా చక్కగా ఉంటాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.