Palak Tikki : మనకు అందుబాటులో ఉండే అనేక రకాల కూరగాయల్లో పాలకూర కూడా ఒకటి. దీంతో మనం అనేక రకాల వంటలను చేస్తుంటాం. పాలకూర పప్పు, పచ్చడి, కూర.. ఇలా పాలకూరతో ఏం చేసినా సరే బాగుంటుంది. అయితే పాలకూరతో ఎంతో రుచిగా ఉండే స్నాక్స్ కూడా చేసుకోవచ్చు. వాటిల్లో పాలక్ టిక్కీ కూడా ఒకటి. వీటిని చాలా మంది రుచి చూసి ఉండరు. కానీ ఒక్కసారి తింటే మాత్రం మళ్లీ మళ్లీ ఇలాగే కావాలంటరు. ఈ క్రమంలోనే పాలక్ టిక్కీలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలక్ టిక్కీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఆలుగడ్డలు – పావు కిలో, కొత్తిమీర తురుము – అర కప్పు, బఠానీలు – ఒక కప్పు, పచ్చి మిర్చి – 4, పాలకూర కట్టలు – నాలుగు (చిన్నవి), శనగపిండి – 3 టేబుల్ స్పూన్లు, బ్రెడ్ పొడి – పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒకటిన్నర స్పూన్, గరం మసాలా – అర టీస్పూన్, ఆమ్‌చూర్ పొడి – పావు టీస్పూన్, నూనె – వేయించడానికి సరిపడా.
పాలక్ టిక్కీ తయారు చేసే విధానం..
ఆలుగడ్డలను ముందుగా ఉడికించి పొట్టు తీసి మెత్తగా మెదపాలి. విడిగా ఓ కడాయిలో శనగపిండి వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించి పక్కన పెట్టాలి. కడాయిలో రెండు టీస్పూన్ల నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత బఠానీలు, పచ్చి మిర్చి కూడా వేసి ఒక నిమిషం వేగాక కొద్దిగా నీళ్లు చిలకరించి బఠానీలను ఉడకనివ్వాలి. ఇప్పుడు కడిగి, తరిగిన పాలకూర కూడా వేసి ఉడికించాలి. తరువాత గరం మసాలా, ఆమ్ చూర్ పొడి వేసి కలిపి దించి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన పాలకూర, బఠానీ మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి తీయాలి. అందులోనే ఉడికించి మెదిపిన ఆలుగడ్డలు, శనగపిండి వేసి కలపాలి. చివరగా బ్రెడ్ పొడి కూడా వేసి కలిపి గుండ్రని బిళ్లల్లా చేసుకోవాలి. వీటిని పెనం మీద నూనె వేస్తూ రెండు వైపులా కాల్చి తీయాలి. అంతే.. ఎంతో రుచిగా ఉండే పాలక్ టిక్కీలు రెడీ అవుతాయి. వీటిని నేరుగా అలాగే తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. అందరూ ఇష్టంగా తింటారు.