Palakura Pappu : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో పాలకూర ఒకటి. దీనిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, బీపీ నియంత్రించడంలో, రోగ నిరోధక శక్తిని పెచండంలో, కంటిచూపును మెరుగుపరచడంలో పాలకూర మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పాలకూరతో ఎక్కువగా పాలకూర పప్పును తయారు చేస్తూ ఉంటాం. పాలకూర పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఈ పాలకూర ప్పును మరింత రుచిగా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలకూర పప్పు తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన పాలకూర – 5 కట్టలు , ఉడికించిన కంది పప్పు – 100 గ్రా., తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 3, కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 5, కరివేపాకు – ఒక రెమ్మ, ధనియాలు- ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 7, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఇంగువ – కొద్దిగా, నానబెట్టిన చింతపండు – చిన్న నిమ్మకాయంత.
పాలకూర పప్పు తయారీ విధానం..
ముందుగా కళాయిలో ఒక టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఇంగువ వేసి వేయించాలి. తరువాత పాలకూర వేసి వేయించాలి. పాలకూర చక్కగా వేగిన తరువాత ఉడికించిన కందిపప్పు వేసి కలపాలి. తరువాత ఉప్పు, పసుపు, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, చింతపండు రసం వేసి కలపాలి. తరువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి అంతా కలిసేలా బాగా కలపాలి.
దీనిని మరో నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పాలకూర పప్పు తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటి, పుల్కా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే పాలకూర కంటే ఈ విధంగా చేసే పాలకూర పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఈ పప్పును తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ పప్పును అందరూ ఇష్టంగా తింటారు.