Pesarla Masala Kura : పెసర్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. మన శరీరానికి కావల్సిన పోషకాలను, శక్తి అందించడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. పెసర్లను మొలకెత్తించి తీసుకోవడంతో పాటు వీటితో మనం ఎంతో రుచిగా ఉండే కూరను కూడా తయారు చేసుకోవచ్చు. పెసర్ల కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని తినడం వల్ల రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొందవచ్చు. చపాతీలతో తింటే ఈ కూర మరింత రుచిగా ఉంటుంది. ఎంతో రుచిగా ఉండే పెసర్ల కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పెసర్ల మసాలా కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసర్లు – ఒక కప్పు, నీళ్లు – 3 కప్పులు, లవంగాలు – 3, యాలకులు – 2, దాల్చిన చెక్క – ఒక ముక్క, ఉడికించిన టమాటాలు – 3, నూనె- 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2, ఉప్పు – తగినంత, తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్- ఒక టీ స్పూన్, కారం – రెండు టీ స్పూన్స్, పసుపు – అర టీ స్పూన్, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, గరం మసాలా – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్.
పెసర్ల మసాలా కూర తయారీ విధానం..
ముందుగా పెసర్లను శుభ్రంగా కడిగి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత వీటిని ఒక కుక్కర్ లోకి తీసుకోవాలి. ఇందులోనే నీళ్లు, పసుపు, ఒక టీ స్పూన్ ఉప్పు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఉడికించిన టమాటాలను జార్ లో వేసుకుని ఫ్యూరీలాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
తరువాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి వేయించాలి. తరువాత టమాట ఫ్యూరీ వేసి వేయించాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత ఉడికించిన పెసర్లను నీటితో సహా వేసుకోవాలి. అవసరమైతే మరి కొద్దిగా నీటిని వేసుకుని కలపాలి. దీనిపై మూత పెట్టి మరో 4 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పెసర్ల కూర తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా పెసర్ల కూరను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.