Dondakaya Vepudu : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో దొండకాయలు కూడా ఒకటి. దొండకాయలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇతర కూరగాయల వలె వీటిని కూడా మనం ఆహారంలో భాగంగా తీసుకోవాలి. దొండకాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో దొండకాయ వేపుడు కూడా ఒకటి. దొండకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఈ దొండకాయ వేపుడును మనం పచ్చికారం వేసి మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. తరచూ చేసే దొండకాయ వేపుడు కంటే ఈ విధంగా చేసిన దొండకాయ వేపుడు మరింత రుచిగా ఉంటుంది. మరింత రుచిగా దొండకాయ వేపుడును ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దొండకాయ వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
దొండకాయలు – అరకిలో, నూనె – 3 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, పచ్చిమిర్చి – 8 లేదా తగినన్ని, వెల్లుల్లి రెబ్బలు – 10, జీలకర్ర – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ఎండు కొబ్బరి పొడి – ఒక టేబుల్ స్పూన్.
దొండకాయ వేపుడు తయారీ విధానం..
ముందుగా దొండకాయలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత జార్ లో పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించుకోవాలి. తరువాత దొండకాయ ముక్కలు, కరివేపాకు, ఉప్పు వేసి వేయించాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత మూత పెట్టి వేయించాలి. తరువాత వీటిని మధ్య మధ్యలో కలుపుతూ పూర్తిగా వేయించాలి. దొండకాయ ముక్కలు వేగిన తరువాత పసుపు వేసి కలపాలి.
తరువాత మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి వేసి వేయించాలి. దీనిని మూడు నిమిషాల పాటు వేయించిన తరువాత ఎండు కొబ్బరి పొడి వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దొండకాయ వేపుడు తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. దొండకాయ వేపుడును తినని వారు కూడా దీనిని ఇష్టంగా తింటారు.