Poha Vada : మనం అటుకులతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. అటుకులతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా సులభంగా చాలా తక్కువ సమయంలో వీటిని తయారు చేసుకోవచ్చు. అటుకులతో సులభంగా చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో అటుకుల వడలు కూడా ఒకటి. ఈ వడలను 20 నిమిషాల్లోనే అప్పటికప్పుడు ఇన్ స్టాంట్ గా తయారు చేసుకోవచ్చు. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే ఈ వడలు తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటాయి. అల్పాహారంగా లేదా స్నాక్స్ గా వీటిని తీసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా, క్రిస్పీగా ఉండే ఈ అటుకుల వడలను ఇన్ స్టాంట్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పోహ వడ తయారీకి కావల్సిన పదార్థాలు..
మందంగా ఉండే అటుకులు – ఒకటిన్నర కప్పు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం ముక్కలు – ఒక టీ స్పూన్, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, బియ్యంపిండి – 2 లేదా 3 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, జీలకర్ర – అర టీ స్పూన్, పెరుగు – ముప్పావు కప్పు, నూనె – డీప్ ప్రైకు సరిపడా.
పోహ వడ తయారీ విధానం..
ముందుగా అటుకులను గిన్నెలో వేసి2 నుండి 3 సార్లు బాగా కడగాలి. తరువాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి అటుకులపై మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. అటుకులు మెత్తగా అయిన తరువాత చేత్తో బాగా కలపాలి. లేదంటే జార్ లో వేసి మెత్తగా మిక్సీపట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి కలపాలి. తరువాత చేతికి నూనె రాసుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని వడలాగా వత్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వడలను వేసి వేయించాలి. వీటిని వేసిన వెంటనే కదపకుండా రెండు నిమిషాల తరువాత అటు ఇటూ కదుపుతూ వేయించాలి.
ఈ వడలను మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పోహ వడలు తయారవుతాయి. వీటిని చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా తయారు చేసిన అటుకుల వడలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అటుకులతో తరుచూ ఒకేరకం వంటకాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు.