Potato Fingers : మనం బంగాళాదుంపలతో రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంపలతో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో పొటాటో ఫింగర్స్ కూడాఒకటి. ఈ పొటాటో ఫింగర్స్ చాలా రుచిగా ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే ఈ పొటాటో ఫింగర్స్ ను మనం చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. వీటిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ పొటాటో ఫింగర్స్ ను ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పొటాటో ఫింగర్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన బంగాళాదుంపలు – 2,ఉప్పు – తగినంత, కారం – అర టీ స్పూన్, వాము – అర టీ స్పూన్, నూనె – డీప్ ప్రైకు సరిపడా, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ -ఒక టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ – ఒక కప్పు.
పొటాటో ఫింగర్స్ తయారీ విధానం..
ముందుగా బంగాళాదుంపలను ఉండలు లేకుండా మెత్తగా చేసుకోవాలి లేదా తురిమి తీసుకోవాలి. తరువాత ఇందులో నూనె, కార్న్ ఫ్లోర్ తప్ప మిగిలిన పదార్థాలు వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా బాగా కలుపుకున్న తరువాత కొద్ది కొద్దిగా పొటాటో మిశ్రమాన్ని తీసుకుని ఫింగర్స్ ఆకారంలో చుట్టుకోవాలి. తరువాత వీటిని కార్న్ ఫ్లోర్ తో కోట్ చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పొటాటో ఫింగర్స్ ను నెమ్మదిగా నూనెలో వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై క్రిస్పీగా, ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పొటాటో ఫింగర్స్ తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. బంగాళాదుంపలతో తరచూ ఒకేరం స్నాక్స్ కాకుండా ఇలా కూడా తయారు చేసుకుని తినవచ్చు.