Prawns Masala Curry : తిన్న కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే నాన్ వెజ్ వంటకాల్లో ప్రాన్స్ మసాలా కర్రీ కూడా ఒకటి. రొయ్యలతో చేసే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీని వంటరాని వారు, బ్యాచిలర్స్, మొదటిసారి చేసే వారు ఇలా ఎవరైనా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. రొయ్యలతో చేసే ఇతర వంటకాల కంటే ఈ కర్రీ మరింత రుచిగా ఉంటుంది. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. చూస్తేనే తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ ప్రాన్స్ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రాన్స్ మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
రొయ్యలు – పావుకిలో, తరిగిన ఉల్లిపాయ – పెద్దది ఒకటి, పచ్చిమిర్చి – 4, అల్లం – ఒక ఇంచు ముక్క, వెల్లుల్లి రెబ్బలు- 8, నూనె – అర కప్పు, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, కారం -ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి -ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, నీళ్లు – పావు లీటర్, గరం మసాలా – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ప్రాన్స్ మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా రొయ్యలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో కొద్దిగా ఉప్పు, అర టీ స్పూన్ పసుపు వేసి కలపాలి. తరువాత రొయ్యలను ఒక గంటపాటు ఫ్రిజ్ లో ఉంచాలి. తరువాత జార్ లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక రొయ్యలు వేసి వేయించాలి. వీటిని 50 శాతం వేయించిన తరువాత ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత అదే కళాయిలో మరో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. తరువాత కరివేపాకు వేసి వేయించాలి. కరివేపాకు వేగిన తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి.
దీనిని ఎర్రగా అయ్యే వరకు వేయించిన తరువాత ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత వేయించిన రొయ్యలు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి నూనె పైకి తేలి కూర దగ్గర పడే వరకు ఉడికించాలి. చివరగా గరం మసాలా, కొత్తిమీర వేసుకుని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ప్రాన్స్ మసాలా కర్రీ తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.