Pulka : గోధుమపిండితో మనం చపాతీ, రోటీ వంటి వాటితో పాటు పుల్కాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. ఈ మధ్య కాలంలో పుల్కాలను చాలా మంది తింటున్నారు. బరువు తగ్గాలనుకునే వారు, షుగర్ వ్యాధితో బాధపడే వారు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే వెజ్, నాన్ వెజ్ వంటకాలతో తినడానికి ఈ పుల్కాలు చాలా చక్కగా ఉంటాయి. చాలా మంది పుల్కాలను తయారు చేసినప్పటికి ఇవి చల్లారిన తరువాత గట్టిగా అయిపోతూ ఉంటాయి. అలాగే కొంతమందికి పొంగేలా పుల్కాలను తయారు చేసుకోవడం రాదు. అలాంటి వారు కింద చెప్పిన విధంగా చేయడం వల్ల చాలా సులభంగా మెత్తటి పుల్కాలను తయారు చేసుకోవచ్చు. చల్లారిన తరువాత కూడా మెత్తగా ఉండేలా పుల్కాలను ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
పుల్కా తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – ఒక కప్పు, ఉప్పు – తగినంత, వేడి నీళ్లు – తగినన్ని.
పుల్కా తయారీ విధానం..
ముందుగా గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. తరువాత ఉప్పు వేసి కలపాలి. తరువాత తగినన్ని వేడి నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. పిండిని చక్కగా కలుపుకున్న తరువాత చిన్న ఉండలుగా చేసుకోవాలి. తరువాత ఒక్కో ఉండను తీసుకుంటూ పొడి పిండి చల్లుకుంటూ వత్తుకోవాలి. పుల్కా మరీ మందంగా, మరీ పలుచగా ఉండకుండా చూసుకోవాలి. ఇలా పుల్కాను వత్తుకున్న తరువాత దీనిని ముందుగా వేడి వేడి పెనం మీద వేసి కాల్చుకోవాలి. ఈ పుల్కాను ఒక వైపు పూర్తిగా అలాగే మరో వైపు కొద్దిగా తక్కువగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తరువాత ఈ పుల్కాను తక్కువ కాల్చుకున్న వైపు మంట మీద ఉంచి కాల్చుకోవాలి. పుల్కా చక్కగా పొంగి కాలిన తరువాత ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పుల్కాలు చక్కగా పొంగడంతో పాటు చల్లారిన తరువాత కూడా మెత్తగా ఉంటాయి. ఈ విధంగా పుల్కాలను తయారు చేసి తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.