4 Powders : మనం వంటింట్లో అనేక రకాల కూరలను వండుతూ ఉంటాము. వేపుళ్లు, పప్పు వంటి వాటితో పాటు మసాలా కూరలను, గ్రేవీ కూరలను కూడా వండుతూ ఉంటాము. సాధారణంగా గ్రేవీ కూరలు చిక్కగా ఉండడానికి గ్రేవీ ఎక్కువగా ఉండడానికి వీటిలో పెరుగు, పాలు, క్రీమ్ వంటి వాటిని వేస్తూ ఉంటాము. ఇవి వేయడం వల్ల కూరలు చిక్కగా ఉంటాయి. అయితే ఇలా పాలు, ఫ్రెష్ క్రీమ్ వంటివి వేయడం వల్ల కూరలు మరింత చప్పగా తయారవుతాయి. దీంతో మనం ఉప్పు, కారం, మసాలా పొడులు వంటివి ఎక్కువగా వేయాల్సి ఉంటుంది. ఇలా ఉప్పు, కారం, మసాలాలు ఎక్కువగా వేయడం వల్ల కూరలు రుచిగా ఉన్నప్పటికి వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఉప్పు, కారం, మసాలాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల బీపీ, అల్సర్, అధిక బరువు వంటి అనేక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది.
ఇలా పాలు, పెరుగు, ఫ్రెష్ క్రీమ్ వంటి వాటిని వాడకుండా అలాగే రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా కూడా మనం గ్రేవీ కర్రీలను తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో ఎప్పుడూ ఈ నాలుగు రకాల పొడులను సిద్దంగా ఉంచుకోవడం వల్ల ఉప్పు, కారం ఎక్కువగా వాడకుండా రుచిగా, మరింత ఆరోగ్యకరంగా కూరలను తయారు చేసుకోవచ్చు. మన వంటింట్లో ఉండాల్సిన నాలుగు రకాల పొడులల్లో పుచ్చగింజల పప్పు పొడి ఒకటి. పుచ్చగింజలల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ పొడి వేయడం వల్ల కూరలు కూడా చాలా రుచిగా ఉంటాయి. తీపి వంటకాల్లో కూడా పుచ్చగింజల పప్పును మనం వాడుకోవచ్చు. ఈ పప్పును పొడిగా చేయడంతో పాటు దీనిని 4 నుండి 5 గంటల పాటు నానబెట్టి మెత్తని పేస్ట్ లాగా చేసుకుని కూరలల్లో వేసుకోవచ్చు. ఇలా పుచ్చగింజల పప్పును వాడడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. అలాగే రెండవది కర్బూజ గింజల పప్పు పొడి. కర్బూజ గింజలల్లో సోడియం ఎక్కువగా ఉంటుంది.
ఉప్పు తక్కువగా తినాలనుకునే వారు వంటలల్లో కర్బూజ గింజలను వాడడం వల్ల కూరలు చాలా రుచిగా ఉంటాయి. ఉప్పు లేని లోటు కూరలల్లో కనిపించదు. ఈ గింజలను కూడా పొడిగా లేదా నానబెట్టి పేస్ట్ గా చేసి వంటలల్లో వాడుకోవచ్చు. అలాగే పొద్దు తిరుగుడు గింజలను కూడా మనం వంటలల్లో వాడుకోవచ్చు. వీటిని నానబెట్టి పేస్ట్ గా చేసి వంటలల్లో వాడుకోవడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఇక నాలుగవది గుమ్మడి గింజల పప్పు. వీటిని కూడా మనం పేస్ట్ గా చేసి వంటలల్లో వాడుకోవచ్చు. ఇలా ఈ నాలుగు రకాల గింజలను మనం వంటల్లో సులభంగా వాడుకోవచ్చు. వీటిలో మనకు నచ్చిన గింజలను వాడుకోవచ్చు లేదా ఈ నాలుగుంటిని కూడా ఒకేసారి నానబెట్టి కూడా వంటల్లో వాడుకోవచ్చు. ఇలా గ్రేవీ కర్రీలల్లో ఈ గింజలను వాడడం వల్ల కూరలు రుచిగా ఉండడంతో పాటు శరీరానికి కావల్సిన ప్రోటీన్, ఫైబర్ అందుతుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. అలాగే కూరలల్లో ఉప్పు, కారం, నూనె వాడకం కూడా తగ్గుతుంది. ఈ విధంగా వంటలల్లో ఈ గింజలను వాడడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.