Raw Coconut Burfi : మనం పచ్చి కొబ్బరిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పచ్చి కొబ్బరి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చర్మాన్ని మరియు జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ఇది మనకు దోహదపడుతుంది. పచ్చి కొబ్బరితో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. పచ్చి కొబ్బరితో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చి కొబ్బరితో చేసుకోదగిన తీపి వంటకాల్లో పచ్చి కొబ్బరి బర్ఫీ కూడా ఒకటి. పచ్చి కొబ్బరిని ఉపయోగించి చేసే ఈ తీపి వంటకం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా తేలిక. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ కొబ్బరి బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి కొబ్బరి బర్ఫీ తయారీకి కావల్సిన పదార్థాలు..
కొబ్బరి కాయలు – 2, నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్, పంచదార – ముప్పావు కప్పు, యాలకుల పొడి – పావు టీ స్పూన్.
పచ్చి కొబ్బరి బర్ఫీ తయారీ విధానం..
ముందుగా కొబ్బరి కాయల నుండి కొబ్బరి నుండి సేకరించాలి. తరువాత కొబ్బరికి వెనుక వైపు ఉండే నల్లటి భాగాన్న తీసి వేయాలి. ఇప్పుడు కొబ్బరిని జార్ లో వేసి లేదా చేత్తో తురుముకోవాలి. ఇప్పుడు కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక కొబ్బరిని వేసి వేయించాలి. ఈ కొబ్బరిని మధ్యస్థ మంటపై పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఇలా వేయించిన తరువాత పంచదార వేసి కలపాలి. పంచదార కరిగి తీగ పాకం వచ్చే వరకు కలుపుతూ వేయించాలి. ఇలా వేయించిన తరువాత కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని ఉండలా చుట్టి చూడాలి. కొబ్బరి మిశ్రమం ఉండలా చుట్టడానికి రాగానే యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తరువాత నెయ్యి రాసిన ఒక ప్లేట్ లోకి ఈ మిశ్రమాన్ని తీసుకుని పైన అంతా సమానంగా చేసుకోవాలి. ఈ మిశ్రమం కొద్దిగా చల్లారిన తరువాత కావల్సిన ఆకారంలో గాట్లు పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తరువాత ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పచ్చి కొబ్బరి బర్ఫీ తయారవుతుంది. ఇది నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా ఉంటుంది. తీపి తినాలనిపించినప్పుడు, పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా బర్ఫీని తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.