Rohit Sharma : భారత్, శ్రీలంక జట్ల మధ్య బెంగళూరులో రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం విదితమే. అందులో భాగంగానే భారత బౌలర్ల ధాటికి శ్రీలంక కుప్పకూలింది. ఈ క్రమంలోనే భారత్ ప్రస్తుతం తన రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది. శ్రీలంక జట్టుపై భారీ ఆధిక్యం సాధించే దిశగా ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే ప్రస్తుతం లంక జట్టుపై భారత్ 350 పరుగులకు పైగా ఆధిక్యంలో ఉంది. ఇంకా ఆట చాలా మిగిలే ఉన్నందున లంక ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచేందుకు భారత్ యత్నిస్తోంది. అయితే రెండో టెస్టు తొలి రోజు ఆటలో ఓ దురదృష్టకరమైన సంఘటన చోటు చేసుకుంది.
రెండో టెస్టు తొలి రోజు ఆట సందర్భంగా భారత్ ఇన్నింగ్స్ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఓ బంతికి సిక్సర్ బాదాడు. అయితే ఆ బంతి స్టాండ్స్‌లో కూర్చుని ఉన్న ఓ ప్రేక్షకుడి ముక్కుకు బలంగా తాకింది. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే వెంటనే అతన్ని ఆంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తరలించారు. భారత ఇన్నింగ్స్ సమయంలో ఆరో ఓవర్‌లో విశ్వ ఫెర్నాండో వేసిన బంతిని రోహిత్ సిక్స్ కొట్టగా.. ఈ సంఘటన చోటు చేసుకుంది.
అయితే ఆ వ్యక్తికి డాక్టర్లు పరీక్షలు నిర్వహించగా.. అతని ముక్కు చిట్లిందని తెలిసింది. దీంతో అతనికి వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ప్రాణాపాయం లేదని చెప్పారు. కాగా రోహిత్ శర్మ కేవలం 15 పరుగులు మాత్రమే చేయగలిగాడు. లంకతో సిరీస్‌లో బ్యాట్స్‌మన్‌గా రోహిత్ విఫలం అవుతున్నా.. కెప్టెన్ గా మాత్రం సక్సెస్‌ను సాధిస్తున్నాడని చెప్పవచ్చు.