Salt : మన శరీరంలో ఉప్పు శాతం ఎక్కువైతే ఎలాంటి అనారోగ్యాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. దాంతో కిడ్నీ సమస్యలు వస్తాయి. బీపీ పెరుగుతుంది. హార్ట్ ఎటాక్స్ వస్తాయి. ఇంకా చాలా అనారోగ్యాలే మనల్ని బాధిస్తాయి. అయితే ఇవన్నీ ఆరోగ్యపరంగా కలిగేవి. కానీ ఆరోగ్యం కాకుండా మిగతా విషయాల్లో చూస్తే ఉప్పు మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దాంతో మనం పలు ఇబ్బందులను ఇట్టే దాటేయొచ్చు. పలు వస్తువులను క్లీన్ కూడా చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఉప్పు వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
చర్మంపై ఉన్న మృత కణాలను తొలగించేందుకు ఉప్పు బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఉప్పు వల్ల చర్మం కాంతివంతంగా కూడా మారుతుంది. అందుకు ఏం చేయాలంటే.. స్నానం చేశాక కొద్దిగా ఉప్పును తీసుకుని మోచేతులు, మోకాళ్లు, ఇంకా ఇతర నల్లగా ఉన్న ప్రదేశాల్లో ఉప్పును రుద్ది ఆ తరువాత కడిగేయాలి. దీంతో అక్కడ ఉన్న చర్మ మృత కణాలు పోతాయి. ఆ భాగాల్లో చర్మం మృదువుగా మారడమే కాదు, కాంతివంతంగా కూడా అవుతుంది.
ఉప్పు వేస్తే మంటను ఇట్టే ఆర్పేయవచ్చు తెలుసా. మంట బాగా ఉంటే దాన్ని తగ్గించేందుకు లేదా ఆర్పేందుకు దానిపై కొంత ఉప్పు వేస్తే చాలు, మంట ఇట్టే అదుపులోకి వస్తుంది. ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో అర టీస్పూన్ ఉప్పు వేయాలి. అనంతరం ఆ మిశ్రమంలో ఒక శుభ్రమైన వస్త్రాన్ని ముంచి దాంతో కళ్లపై మసాజ్ చేసినట్టు రాయాలి. ఇలా చేయడం వల్ల కళ్ల కలక, వాపులు తగ్గుతాయి. కోడిగుడ్లను తెచ్చి బాగా రోజులు అవుతుందా..? అవి మంచిగా ఉన్నాయో, కుళ్ళి పోయాయో తెలియడం లేదా..? అయితే ఏం లేదు, సింపుల్‌గా ఓ గ్లాస్ నీటిలో రెండు టీస్పూన్ల ఉప్పు వేసి బాగా కలపండి. అనంతరం ఆ మిశ్రమంలో గుడ్లను వేయండి. ఒక వేళ గుడ్డు మునిగిపోతే అది మంచిదే అని లెక్క. గుడ్డు ఆ నీటిపై తేలితే అది కుళ్లిపోయినట్టు నిర్దారించుకోవాలి.
వెండి, రాగి వస్తువులు బాగా మాసినట్టు అయ్యాయా..? అయితే వాటిని ఉప్పుతో తోమి చూడండి. తళతళా మెరుస్తాయి. ఇస్త్రీ పెట్టెపై గోధుమ రంగు చిలుం మచ్చలు పడ్డాయా..? అయితే దిగులు చెందకండి. ఒక బ్రౌన్ పేపర్‌పై కొంత ఉప్పు వేసి అనంతరం దాన్ని ఐరన్ చేయండి. దీంతో ఇస్త్రీ పెట్టెపై ఉన్న మచ్చలు పోతాయి. మూడు భాగాల్లో రెండు భాగాలు బేకింగ్ సోడా, ఒక భాగం ఉప్పు కలిపి ఆ మిశ్రమంతో పళ్లు తోముకుంటే దంతాలు తళతళా మెరుస్తాయి. చిగుళ్లు దృఢంగా మారుతాయి.
ఆలుగడ్డలు, యాపిల్స్‌ను కట్ చేశాక అవి గోధుమ రంగులోకి మారుతాయి. అలా కాకుండా ఉండాంటే ఆ ముక్కలను కోసిన వెంటనే ఓ పాత్రలో చల్లని నీటిని తీసుకుని అందులో కొంత ఉప్పు వేయాలి. ఆ తరువాత పాత్రలో ఆ ముక్కలు వేస్తే అవి రంగు మారకుండా ఉంటాయి. సోడా నీటిలో కొంత ఉప్పు వేసి ఆ మిశ్రమంతో ఫ్రిజ్ లోపలి భాగం క్లీన్ చేస్తే అది తళ తళా మెరుస్తుంది. ఫ్రిజ్‌లో వచ్చే దుర్వాసన పోతుంది. సహజ సిద్ధమైన పూలు కాకుండా ప్లాస్టిక్ పూలను కూడా చాలా మంది ఇంట్లో అలంకరణ కోసం వాడుతారు. అయితే అవి రాను రాను మాసిపోతాయి. తిరిగి వాటిని మెరిసేలా చేయాలంటే ఒక బ్యాగ్ తీసుకుని అందులో కొంత ఉప్పు వేసి దాంతో పాటు ఆ పూలను కూడా ఆ బ్యాగ్‌లో వేయాలి. అనంతరం ఆ బ్యాగ్‌ను బాగా షేక్ చేయాలి. దీంతో ఆ పూలు మళ్లీ మెరుస్తాయి.
తేనెటీగ కుట్టిన ప్రదేశంలో నొప్పి, మంట ఉంటాయి. కొందరిలో దద్దుర్లు కూడా వస్తాయి. అయితే ఆ బాధల నుంచి ఉపశమనం కలగాలంటే ఆ ప్రదేశంలో కొద్దిగా నీరు పోసి దాన్ని అలాగే ఉంచి కొద్దిగా ఉప్పు పెట్టాలి. అనంతరం గుడ్డతో కట్టు కట్టాలి. ఇలా చేస్తే ఉపశమనం కలుగుతుంది. ఇలా ఉప్పుతో మనం అనేక విధాలుగా ప్రయోజనాలను పొందవచ్చు.