Shanaga Pappu Laddu : మనలో చాలా మంది ఇష్టంగా తినే తీపి వంటకాల్లో లడ్డూలు కూడా ఒకటి. లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. మనం సాధారణంగా లడ్డూలను తయారు చేయడానికి శనగపిండిని, చక్కెరను వాడుతూ ఉంటాము. అయితే శనగపిండి, చక్కెరలను వాడకుండా కూడా మనం అప్పటికప్పుడు రుచికరమైన లడ్డూలను తయారు చేసుకోవచ్చు. వీటిని తినడం వల్ల శరీరానికి బలం కలుగుతుంది. శనగపిండి, చక్కెర వాడకుండా రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపప్పు – ఒక కప్పు, నెయ్యి – 4 టీ స్పూన్స్, డ్రై ఫ్రూట్స్ – తగినన్ని, బెల్లం – ఒక కప్పు, నీళ్లు – ఒక కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్.

లడ్డూ తయారీ విధానం..
ముందుగా శనగపప్పును ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత దీనిని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి 6 గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఈ పప్పును ఒక జార్ లోకి తీసుకుని 3 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ ను వేసి వేయించాలి. తరువాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత అదే కళాయిలో మిక్సీ పట్టుకున్న శనగపప్పు మిశ్రమం వేసి కలపాలి. దీనిని మధ్యస్థ మంటపై కలుపుతూ వేయించాలి. పేస్ట్ లాగా ఉన్న ఈ మిశ్రమం కొద్ది సమయానికి రవ్వ లాగా పొడి పొడిగా తయారవుతుంది. ఇలా రవ్వ లాగా అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత దీనిని జార్ లోకి తీసుకుని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో లేదా కళాయిలో బెల్లాన్ని తీసుకోవాలి.
తరువాత ఇందులో నీళ్లు పోసి కలుపుతూ వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత దీనిని వడకట్టి మరలా కళాయిలోకి తీసుకుని వేడి చేయాలి. దీనిని లేత తీగపాకం వచ్చే వరకు ఉడికించిన తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న శనగపప్పు మిశ్రమం వేసి కలపాలి. దీనిని 3 నిమిషాల పాటు కలుపుతూ వేయించిన తరువాత యాలకుల పొడి, మరో 2 టీ స్పూన్ల నెయ్యి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం కొద్దిగా చల్లారిన తరువాత మనకు కావల్సినంత పరిమాణంలో లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే శనగపప్పు లడ్డూ తయారవుతుంది. ఈ లడ్డూలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.