Sweet Corn Spinach Curry : పాలకూర, స్వీట్‌కార్న్.. రెండింటి వల్ల కూడా మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. పాలకూరలో విటమిన్ ఎ, సి, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అలాగే స్వీట్‌కార్న్‌లో బి కాంప్లెక్స్ విటమిన్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. కనుక రెండింటినీ తీసుకుంటే ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇక ఈ రెండింటినీ కలిపి కూరగా వండుకుని కూడా తినవచ్చు. దీంతో రెండింట్లో ఉండే పోషకాలను ఒకేసారి పొందవచ్చు. ఇక వీటి కూరను చపాతీల్లో తింటే బాగుంటుంది. ఈ కూరను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బుట్టె కి చమన్ (స్వీట్ కార్న్, పాలకూర) తయారీకి కావల్సిన పదార్థాలు..
స్వీట్ కార్న్ గింజలు – రెండు కప్పులు, పాలకూర – పది కట్టలు (చిన్నవి), ఉల్లిపాయలు – రెండు, పచ్చిమిర్చి – నాలుగు, జీలకర్ర పొడి – అర టీస్పూన్, అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీస్పూన్, నూనె – 50 ఎంఎల్, కారం – పావు టీస్పూన్, క్రీమ్ – 10 ఎంఎల్, జీడిపప్పు ముద్ద – 2 టీస్పూన్లు.
బుట్టె కి చమన్ ను తయారు చేసే విధానం..
స్వీట్ కార్న్ గింజలను ఆవిరిమీద 10 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత దింపేయాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు కలిపి మెత్తగా రుబ్బాలి. పాలకూరను శుభ్రంగా కడిగి నీళ్లలో వేసి మరిగించాలి. ఇప్పుడు నీళ్లు వంపేసి మెత్తగా గ్రైండ్ చేసి ఉంచాలి. ఓ బాణలిలో నూనె వేసి ఉల్లి ముద్ద వేసి నూనె తేలే వరకు వేయించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, జీడిపప్పు ముద్ద వేసి బాగా వేయించాలి. తరువాత పాలకూర ముద్ద వేసి ఉడికించాలి. ఇప్పుడు స్వీట్ కార్న్ గింజలు, జీలకర్ర పొడి, ఉప్పు, కారం వేసి ఒక నిమిషం పాటు ఉడికించాలి. చివరగా క్రీమ్ కలిపి దింపేయాలి. దీంతో రుచికరమైన పాలకూర, స్వీట్ కార్న్ కూర రెడీ అవుతుంది. దీన్ని చపాతీలతోపాటు పుల్కాలు, రోటీల్లోనూ తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది.