Karivepaku Karam : మనం వంటల్లో కరివేపాకును వాడుతూ ఉంటాం. కానీ కరివేపాకును భోజనం చేసేటప్పుడు చాలా మంది తీసి పక్కన పెడుతుంటారు. కరివేపాకును తినడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. దెబ్బలను, కాలిన గాయాలను తగ్గించడంలో కరివేపాకు ఎంతో సహాయపడుతుంది. బరువు తగ్గడంలో, షుగర్ వ్యాధిని నియంత్రించడంలో, ఙ్ఞాపకశక్తి, కంటి చూపును మెరుగుపరచడంలో కరివేపాకు ఉపయోగపడుతుంది. కనుక కరివేపాకును తప్పకుండా తినాలి. వంటల్లో వేసే కరివేపాకును తినలేని వారు కరివేపాకుతో కారాన్ని తయారు చేసుకుని తినవచ్చు. కరివేపాకుతో చేసిన కారం ఎంతో రుచిగా ఉంటుంది. ఇప్పుడు కరివేపాకుతో కారాన్ని ఎలా తయారు చేసుకోవాలి, తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను తెలుసుకుందాం.
కరివేపాకు కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
కరివేపాకు – రెండు కప్పులు, నూనె – 2 టీ స్పూన్స్, శనగపప్పు – ఒక టేబుల్ స్పూన్, మినప పప్పు – ఒక టేబుల్ స్పూన్, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టేబుల్ స్పూన్, మెంతులు – కొద్దిగా, ఎండు మిరప కాయలు – 10 నుంచి 15, ఇంగువ – పావు టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 10 పొట్టు తీయనివి.
కరివేపాకు కారం తయారీ విధానం..
ముందుగా కరివేపాకును శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి కాగాక శనగపప్పు, మినప పప్పు వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇవి వేగాక కరివేపాకు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి రంగు మారే వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత చివర్లో కరివేపాకును వేసి మరీ ఎక్కువగా కాకుండా మధ్యస్థంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న కరివేపాకు మిశ్రమం పూర్తిగా చల్లారిన తరువాత ఒక జార్ లో వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకులు ఉండేలా పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కరివేపాకు కారం తయారవుతుంది. ఈ కారానికి గాలి తగలకుండా మూత ఉండే బాక్స్ లో వేసి నిల్వ చేసుకోవాలి. ఇలా నిల్వ చేయడం వల్ల కరివేపాకు కారం నెల రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కరివేపాకు కారం, నెయ్యి వేసుకొని తింటే రుచితో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది.