Telangana Style Bagara Rice : మనకు తెలంగాణా ఫంక్షన్ లల్లో ఎక్కువగా సర్వ్ చేసే వాటిల్లో బగారా అన్నం కూడా ఒకటి. బగారా అన్నం చాలా రుచిగా ఉంటుంది. మసాలా కూరలతో తింటే ఇది మరింత రుచిగా ఉంటుంది. పండగలకు, స్పెషల్ డేస్ లో కూడా దీనిని ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నాన్ వెజ్ తో దీనిని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ బగారా అన్నాన్ని తయారు చేయడం చాలా సులభం. ఎవరైనా చాలా సులభంగాదీనిని తయారు చేసుకోవచ్చు. నాన్ వెజ్ వంటకాలు వండుకున్నప్పుడు మరింత స్పెషల్ గా ఇలా బగారా అన్నాన్ని వండుకోవచ్చు. తెలంగాణా స్టైల్ లో బగారా అన్నాన్ని ఎలా వండుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
బగారా అన్నం తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – 1/3 కప్పు, పొడవుగా తరిగిన ఉల్లిపాయ – పెద్దది ఒకటి, సాజీరా – ఒక టీ స్పూన్, లవంగాలు – 5, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, మిరియాలు – అర టీ స్పూన్, యాలకులు – 5, నల్ల యాలక్కాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 5, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, గంట పాటు నానబెట్టిన బాస్మతీ బియ్యం – ఒక కప్పు, నీళ్లు – ఒక కప్పు, పుదీనా – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – 2 టీ స్పూన్స్, గరం మసాలా – పావు టీ స్పూన్.
బగారా అన్నం తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత సాజీరా, మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిని 2 నిమిషాల పాటు వేయించిన తరువాత నానబెట్టుకున్న బియ్యం, ఉప్పు వేసి కలపాలి. బియ్యాన్ని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత పుదీనా, కొత్తిమీర, గరంమసాలా వేసి కలపాలి. తరువాత కుక్కర్ మూత పెట్టి పెద్ద మంటపై ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత మూత తీసి అంతా కలిసేలా కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బగారా అన్నం తయారవుతుంది. ఇలా తయారు చేసుకున్న బగారా అన్నంతో వెజ్, నాన్ వెజ్ మసాలా కర్రీలను తింటే చాలా రుచిగా ఉంటుంది.