Thalakaya Kura : మాంసాహార ప్రియులకు తలకాయ కూర రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. చక్కగా వండాలే కానీ తలకాయ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. శరీరానికి తగినంత క్యాల్షియం లభించి ఎముకలు ధృడంగా తయారవుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం పుష్టిగా, బలంగా తయారవుతుంది. ఈ తలకాయ కూరను రుచిగా సులువుగా ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తలకాయ కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
తలకాయ కూర – 750 గ్రా., నూనె – 3 టేబుల్ స్పూన్స్, అనాస పువ్వు – 1, బిర్యానీ ఆకు – 1, ఉల్లిపాయలు – 2 ( మధ్యస్థంగా ఉన్నవి), కరివేపాకు – ఒక రెమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి – 4, చిన్న ముక్కలుగా తరిగిన పెద్ద టమాట – 1, పసుపు – అర టీ స్పూన్, కారం – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, నీళ్లు – అర లీటర్, ఎండు కొబ్బరి పొడి – ఒక టేబుల్ స్పూన్.
మసాలా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
దాల్చిన చెక్క – రెండు ఇంచుల ముక్క, యాలకులు – 2, లవంగాలు – 8, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 5.
తలకాయ కూర తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో మసాలా పొడికి కావల్సిన పదార్థాలు వేసి వేయించుకోవాలి. తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఉల్లిపాయను కూడా ముక్కలుగా చేసి జార్ లోకి తీసుకుని పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అనాస పువ్వు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ పేస్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ పేస్ట్ వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత శుభ్రం చేసుకున్న తలకాయ కూరను వేసుకోవాలి. తరువాత పసుపు, ఉప్పు, కారం వేసి అంతా కలిసేలా కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించాలి.
తరువాత నీళ్లు పోసి మూత పెట్టి 6 నుండి 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కూర ముదురుగా ఉంటే మరికొద్ది సేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మూత తీసి ఆవిరి పోయిన తరువాత మరలా స్టవ్ మీద ఉంచి ఉడికించాలి. కూర చిక్కగా ఉంటే మరికొన్ని నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి. తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, ఎండు కొబ్బరి వేసి కలపాలి. దీనిని మరో 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే తలకాయ కూర తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రాగి సంగటి, బగారా అన్నం వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ తలకాయ కూరను తినడం వల్ల రుచితో పాటు శరీరానికి కావల్సిన పోషకాలను కూడా పొందవచ్చు.