Tomato Paratha : మనం వంటింట్లో విరివిరిగా ఉపయోగించే కూరగాయల్లో టమాటాలు ఒకటి. టమాటాలతో మనం రకరకాల కూరలను, పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాం. టమాటాలతో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. కేవలం కూరలు, పచ్చళ్లే కాకుండా ఈ టమాటాలతో మనం ఎంతో రుచిగా ఉండే పరాటాలను కూడా తయారు చేసుకోవచ్చు. టమాటాలతో చేసే ఈ పరాటాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. రుచిగా, సులువుగా టమాటాలతో పరాటాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట పరాటా తయారీకి కావల్సిన పదార్థాలు..
అల్లం – అర ఇంచు ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 5, సోంపు గింజలు – పావు టీ స్పూన్, పచ్చిమిర్చి – 2, పెద్ద ముక్కలుగా తరిగిన టమాటాలు – 2, వాము – 2 చిటికెలు, ఉప్పు – తగినంత, తరిగినకొత్తిమీర – కొద్దిగా, గోధుమపిండి – ఒకటిన్నర కప్పు, నూనె – ఒక టీ స్పూన్.
టమాట పరాటా తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో అల్లం, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, టమాట ముక్కలు వేసి నీళ్లు పోయకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ పేస్ట్ ను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ టమాట పేస్ట్ లో వాము, ఉప్పు, కొత్తిమీర, గోధుమపిండి వేసి బాగా కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. తరువాత నూనె వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పిండిపై తడి వస్త్రాన్ని ఉంచి 10 నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తరువాత పిండిని ఉండలుగా చేసుకోవాలి. తరువాత ఒక్కో ఉండను తీసుకుంటూ పొడి చల్లుకుంటూ చపాతీలా వత్తుకోవాలి.
తరువాత స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం బాగా వేడయ్యాక పరోటాను వేసి కాల్చుకోవాలి. దీనిని రెండు వైపులా కొద్దిగా కాల్చుకున్న తరువాత నూనె వేస్తూ రెండు వైపులా చక్కగా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట పరాటా తయారవుతుంది. దీనిని పెరుగుతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. టమాటాలతో ఈ విధంగా తయారు చేసిన పరాటాలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.