Tomato Soup : మనకు రెస్టారెంట్ లలో లభించే పదార్థాల్లో టమాట సూప్ కూడా ఒకటి. టమాట సూప్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఎంతో ఇష్టంగా తాగుతారు. అయితే రెస్టారెంట్ లలో టమాట సూప్ రుచిగా రావడానికి అలాగే కలర్ ఫుల్ గా ఉండడానికి దీనిలో కలర్ లను అలాగే వివిధ రకాల పొడులను వేస్తూ ఉంటారు. ఎటువంటి కలర్ లను అలాగే పొడులను వాడకుండా రుచిగా, కలర్ ఫుల్ గా ఉండే టమాట సూప్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. టమాట సూప్ ను తయారు చేయడం చాలా సులభం. రుచిగా, కమ్మగా ఉండే టమాట సూప్ ను ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట సూప్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బటర్ – 2 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి తరుగు – ఒక టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు – 1, మిరియాలు – అర టీ స్పూన్, ఉల్లిపాయ తరుగు – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన చిన్న క్యారెట్ – 1, తరిగిన బీట్ రూట్ – 1 (చిన్నది), టమాట ముక్కలు – 500 గ్రా., పంచదార – ఒక టీ స్పూన్, నీళ్లు – 400 ఎమ్ ఎల్, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – పావు టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ – ఒక టీ స్పూన్.
టమాట సూప్ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో బటర్ వేసి వేడి చేయాలి. బటర్ వేడయ్యాక వెల్లుల్లి తరుగు, బిర్యానీ ఆకు, మిరియాలు, ఉల్లిపాయ తరుగు వేసి వేయించాలి. తరువాత క్యారెట్ ముక్కలు, బీట్ రూట్ ముక్కలు వేసి వేయించాలి. తరువాత పంచదార, ఉప్పు, టమాట ముక్కలు వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు టమాటలపై మూత పెట్టి టమాటాలను మెత్తగా ఉడికించాలి. టమాటాలు మెత్తగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి. టమాటాలు చల్లారిన తరువాత వాటిని నీటితో సహా జార్ లో వేసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని జల్లెడతో వడకట్టుకుని ఒక కళాయిలోకి తీసుకుని వేడి చేయాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపి మధ్యస్థ మంటపై ఒక పొంగు వచ్చే వరకు ఉడికించాలి.
టమాట సూప్ పొంగు వచ్చిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత దీనిపై ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట సూప్ తయారవుతుంది. ఈ సూప్ ను వేడి వేడిగా తాగితే చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ సూప్ తో బ్రెడ్ క్రంబ్స్ ను కలిపి తింటే చాలా చక్కగా ఉంటాయి. ఆకలి లేనప్పుడు, దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు, అలాగే బరువు తగ్గాలనుకునే వారు ఇలా టమాట సూప్ ను తయారు చేసుకుని తినవచ్చు. ఈ సూప్ ను అందరూ ఎంతో ఇష్టంగా తాగుతారు.