Upma : మనం ఉదయం అల్పాహారంలో భాగంగా రకరకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. అందులో బొంబాయి రవ్వతో తయారు చేసే ఉప్మా ఒకటి. కానీ ఉప్మాను తినడానికి చాలా మంది ఇష్టపడరు. సరైన విధానంలో తయారు చేసుకుంటే ఉప్మా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇక ఉప్మాను ఎంతో రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉప్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
బొంబాయి రవ్వ – రెండు కప్పులు, నూనె – 3 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన క్యారెట్ – 1, తరిగిన టమాట – 1, పచ్చి బఠానీ – కొద్దిగా, కరివేపాకు – ఒక రెబ్బ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పచ్చి మిర్చి – 2, తరిగిన అల్లం – కొద్దిగా, నీళ్లు – సరిపడా, నెయ్యి – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత.
ఉప్మా తయారు చేసే విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి కాగాక.. ఆవాలు, జీలకర్ర, పల్లీలు, శనగ పప్పు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక తరిగిన ఉల్లిపాయ, పచ్చి మిర్చి, అల్లం, క్యారెట్, పచ్చి బఠానీ, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక తరిగిన టమాట ముక్కలు వేసి మూత పెట్టి పూర్తిగా ఉడికే వరకు ఉండనివ్వాలి. ఇవి పూర్తిగా వేగాక తరిగిన కొత్తిమీర వేసి వేయించుకోవాలి. తరువాత ఒక కప్పు రవ్వకు ఐదు కప్పుల నీళ్ల చొప్పున రెండు కప్పుల రవ్వకు పది కప్పుల నీళ్లను పోసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసి నీళ్లు మరిగే వరకు ఉంచాలి.
నీళ్లు మరిగిన తరువాత కొద్ది కొద్దిగా రవ్వను వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. తరువాత 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. 2 నిమిషాల తరువాత నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బొంబాయి రవ్వ ఉప్మా తయారవుతుంది. ఇందులో పల్లీలతోపాటుగా జీడి పప్పును కూడా వేసుకోవచ్చు. ఉప్మా గట్టిగా ఉండాలి అనుకునే వారు కొద్దిగా నీటిని తగ్గించి పోసుకోవాలి. పెసరట్టు ఉప్మా తయారీలో ఉప్మా ను ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల ఉప్మా పెసరట్టు మరింత రుచిగా ఉంటుంది. పల్లి చట్నీ, టమాటా చట్నీలతో కలిపి ఉప్మాను తింటే చాలా రుచిగా ఉంటుంది.