Vankaya Masala Gravy : మనం వంకాయలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వంకాయలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. వంకాయలతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. వంకాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో వంకాయ మసాలా గ్రేవీ కూడా ఒకటి. వంకాయతో తరుచూ చేసే మసాలా వంటకాల కంటే ఈ కర్రీ కొద్దిగా భిన్నంగాఉంటుంది. కానీ ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. వంకాయలతో మరింత రుచిగా, కమ్మగా మసాలా గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయ మసాలా గ్రేవీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 3, కరివేపాకు – 2 రెమ్మలు, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2 ( మధ్యస్థంగా ఉన్నవి), చిన్నగా తరిగిన టమాటాలు – 2, పసుపు – అర టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – ఒక గ్లాస్.
మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
వంకాయలు – 150 గ్రా., నూనె – ఒక టేబుల్ స్పూన్, అల్లం – ఒక ఇంచు ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 5, పుదీనా ఆకులు – 10, ఉప్పు – తగినంత, నానబెట్టిన చింతపండు – ఉసిరికాయంత.
మసాలా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
మెంతులు – చిటికెడు, జీలకర్ర – అర టీ స్పూన్, మిరియాలు – అర టీ స్పూన్, ధనియాలు -ఒక టేబుల్ స్పూన్, శనగపప్పు – ఒక టేబుల్ స్పూన్, మినపప్పు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 5, జీడిపప్పు – 10, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 4.
వంకాయ మసాలా గ్రేవీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో మసాలా పొడికి కావల్సిన పదార్థాలు వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత మసాలా పేస్ట్ కు కోసం కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత అల్లం, వెల్లుల్లి రెబ్బలు, పుదీనా ఆకులు, వంకాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించాలి. వంకాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని కూడా మసాలా పొడి వేసిన జార్ లోనే వేసుకోవాలి. తరువాత చింతపండు రసం వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.
తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి. తరువాత టమాట ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి. వీటిని 4 నిమిషాల పాటు వేయించిన తరువాత పసుపు, ఉప్పు, కారం వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు వీటిపై మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. తరువాత కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ మసాలా గ్రేవీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. తరుచూ చేసే వంటకాలతో పాటు వంకాయలతో అప్పుడప్పుడూ ఇలా కూడా తయారు చేసి తీసుకోవచ్చు.