Veg Frankie Roll : వెజ్ ఫ్రాంకీ.. మనం వివిధ రుచుల్లో వీటిని తయారు చేస్తూ ఉంటాము. కింద చెప్పిన విధంగా తయారు చేసే వెజ్ ఫ్రాంకీ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం చాలా తేలిక. పిల్లలు దీనిని ఎంతో ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. లంచ్ బాక్స్ లోకి, స్నాక్స్ గా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఒకటి తింటే చాలు కడుపు నిండి పోతుంది. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే వెజ్ ఫ్రాంకీని ఎలా తయారుచేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వెజ్ ఫ్రాంకీ తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదాపిండి – ఒక కప్పు, గోధుమపిండి – అర కప్పు, ఉప్పు – కొద్దిగా, నూనె – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు – 3, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, కారం – అర టీ స్పూన్, చాట్ మసాలా – అర టీ స్పూన్, ఉడికించిన బంగాళాదుంపలు – 2, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, టమాట కిచప్ – అర కప్పు, క్యాబేజి తరుగు – ఒక కప్పు, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ- 1, పొడవుగా తరిగిన క్యాప్సికం – 2.
వెజ్ ఫ్రాంకీ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో మైదాపిండి, గోధుమపిండి, ఉప్పు, నూనె వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. పిండిని మెత్తగా కలుపుకున్న తరువాత దానిపై మూత పెట్టి అరగంట పాటు పక్కకు ఉంచాలి. తరువాత స్టఫింగ్ కోసం కళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. తరువాత వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి. తరువాత ఉప్పు, కారం, చాట్ మసాలా వేసి కలపాలి. తరువాత ఉడికించిన బంగాళాదుంపలను మెత్తగా చేసి వేసుకోవాలి. తరువాత అంతా కలిసేలా కలుపుకుని కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ముందుగా కలిపిన పిండిని ఉండలుగా చేసుకోవాలి. తరువాత వీటిని పొడి పిండి చల్లుకుంటూ చపాతీలా వత్తుకోవాలి. తరువాత వీటిని వేడి వేడి పెనం మీద వేసి ముందుగా రెండు వైపులా కాల్చుకోవాలి.
తరువాత నూనె వేసి కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత వత్తుకున్న రోటిని ఒక్కొక్కటిగా తీసుకుని దానిపై ఒక టీ స్పూన్ టమాట కిచప్ వేసి రోటీ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత ఆలూ మిశ్రమాన్ని తీసుకుని రోటీ చివరనా పొడవుగా ఉంచాలి. తరువాత దానిపై కొద్దిగా క్యాబేజి తరుగు, 3 నుండి 4 ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు ఉంచాలి. తరువాత పైన కొద్దిగా చాట్ మసాలాను చల్లుకుని రోల్ చేసుకోవాలి. తరువాత దీనిని మధ్యలోకి కట్ చేసి సర్వ్ చేసుకోవాలి. టమాట కిచప్ తో తింటే ఇవి చాలా రుచిగా ఉంటాయి. మైదాపిండికి బదులుగా పూర్తిగా గోధుమపిండిని కూడా ఉపయోగించవచ్చు. ఈ విధంగా తయారు చేసిన వెజ్ ఫ్రాంకీలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.