Vidya Balan : బాలీవుడ్ ఇండస్ట్రీలో విద్యా బాలన్ తన నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ఈమె నటించిన డర్టీ పిక్చర్ అనే సినిమా బంపర్ హిట్ అయింది. దీంతో విద్యాకు బాలీవుడ్‌లో ఆఫర్లు క్యూ కట్టాయి. ఇక ఈమె పెళ్లి చేసుకున్న తరువాత కూడా పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈమె నటించిన అనేక చిత్రాలు హిట్ అయ్యాయి కూడా. ఇక తాజాగా ఈమె నటించిన జల్సా అనే సినిమా ఓటీటీలో నేరుగా రిలీజ్ అవుతోంది. శుక్రవారం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న మూవీ ప్రమోషన్స్‌లో ఈమె పాల్గొంటోంది.
ఇక విద్యా బాలన్ జల్సా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తన జీవితంలో జరిగిన పలు సంఘటనలకు చెందిన విషయాలను తెలియజేసింది. పలువురిపై ఈమె సంచలన కామెంట్లు చేసింది. తన మొదటి సినిమా తుమారీ సులు తరువాత ఈమెకు 13 సినిమాల్లో అవకాశాలు వచ్చాయని.. అయితే వాటి నుంచి తనను తీసేశారని తెలియజేసింది. అప్పట్లో తనను సినిమాల నుంచి తీసేసిన నిర్మాతలే ఇప్పుడు తనకు కాల్ చేసి తమతో సినిమా చేయాలని అడుగుతున్నారని.. వివరించింది. అయితే వారి ఆఫర్లను తాను రిజెక్ట్ చేస్తున్నానని ఆమె చెప్పుకొచ్చింది.
ఇక అప్పట్లో ఓ నిర్మాత తన పట్ల దారుణంగా ప్రవర్తించాడని ఆమె తెలిపింది. తనను అతను అసహ్యంగా చూసేవాడని, అతని ప్రవర్తన వలన తాను ఆరు నెలల పాటు అద్దంలో చూసుకునేందుకు భయపడ్డానని చెప్పింది. ఈ సంఘటన 2003లో జరిగిందని.. అయితే ఆ సమయంలో సినిమాల్లో నటించాలనుకున్నా.. వీలు కాలేదని.. తెలియజేసింది.
ఇక అప్పట్లో కె. బాలచందర్ చేయాల్సిన రెండు పెద్ద సినిమాలకు సంతకం చేశానని.. కానీ ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే తనను తీసివేశారని.. ఆ విషయంపై తనకు ఎంతో బాధ కలిగిందని చెప్పింది. ఆ బాధతో మెరైన్ డ్రైవ్ నుంచి బాంద్రా వరకు నడుస్తూ వెళ్లానని, తాను గంటల తరబడి నడిచానని.. చాలా ఏడ్చానని.. ఆ చేదు జ్ఞాపకాలు ఇప్పుడు తనకు సరిగ్గా గుర్తులేవని చెప్పింది. అయితే ఆ మూడు సంవత్సరాలు మాత్రం ఏ పని చేసినా కలసి రాలేదని.. విద్యా బాలన్ తెలియజేసింది. అంటే.. ప్రతి ఒక్కరి జీవితంలోనూ బ్యాడ్ టైమ్ ఉన్నట్లే అప్పట్లో ఈమెకు చాలా బ్యాడ్ టైమ్ నడిచిందన్నమాట.