Village Style Tomato Chutney : మనం ఇంట్లో ఇన్ స్టాంట్ గా రకరకాల పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన పచ్చళ్లల్లో టమాట పచ్చడి కూడా ఒకటి. టమాట పచ్చడి చాలారుచిగా ఉంటుంది. మనం సాధారణంగా టమాట ముక్కలను నూనెలో వేయించి టమాట పచ్చడిని తయారు చేస్తూ ఉంటాము. ఇలా నూనెలో వేయించడానికి బదులుగా మంటపై కాల్చి కూడా టమాట పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా చేసిన టమాట పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. మంటపై కాల్చిన టమాటాలతో టమాట పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
టమటాలు – 3,పచ్చిమిర్చి – 3, వెల్లుల్లి రెబ్బలు – 10, శనగపప్పు- ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 5,మెంతి గింజలు – 10, ధనియాలు -ఒక టీ స్పూన్, జీలకర్ర -అర టీ స్పూన్, నువ్వులు – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – కొద్దిగా, చింతపండు – చిన్న నిమ్మకాయంత, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ -1.
టమాట చట్నీ తయారీ విధానం..
ముందుగా స్టవ్ మీద స్టాండ్ ను ఉంచి దానిపై టమాటాలను, పచ్చిమిర్చిని, వెల్లుల్లి రెబ్బలను ఉంచాలి. వీటిని చిన్న మంటపై నల్లగా అయ్యే వరకు కాల్చుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, మెంతులు వేసి వేయించాలి. తరువాత ధనియాలు, జీలకర్ర, నువ్వులు వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, పసుపు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఒక జార్ లో వేయించిన దినుసులు, చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి.
తరువాత ఉప్పు, కొత్తిమీర,వేయించిన పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలి. చివరగా కాల్చిన టమాటలపై ఉండే నల్లటి పొట్టును తీసేసి జార్ లో వేసి మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట చట్నీ తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసిన టమాట పచ్చడిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.