MS Dhoni : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగావేలం ఈ మధ్యే ముగిసింది. ఈ నెల 12, 13 తేదీల్లో బెంగళూరులో జరిగిన ఈ వేలంలో భారీ ఎత్తున ప్లేయర్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. దాదాపుగా రూ.500 కోట్లకు పైగానే అన్ని టీమ్‌లు డబ్బును వెచ్చించాయి. ఈ క్రమంలోనే వచ్చే ఐపీఎల్ సీజన్ లో 10 జట్లు ఎలా ఆడబోతాయా.. అన్న ఉత్కంఠ క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. అయితే ఈ వేలం సందర్భంగా సురేష్ రైనాను చెన్నై టీమ్ కొనుగోలు చేయకపోవడం అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. ధోనీకి అత్యంత దగ్గరి ఫ్రెండ్ అయి ఉండి కూడా, చెన్నైని ఎన్నో మ్యాచ్‌లలో ఒంటి చేత్తో గెలిపించినా.. రైనాకు ఆ టీమ్ మోచేయి చూపించింది. అయితే ఇందుకు కారణాలు బలంగానే ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.
2020 ఐపీఎల్ సీజన్ రెండో భాగాన్ని దుబాయ్‌లో నిర్వహించారు. ఈ క్రమంలోనే 15 రోజుల ముందుగా అన్ని టీమ్‌లు, సహాయక సిబ్బంది సహా దుబాయ్‌కు చేరుకున్నారు. అక్కడ పలు హోటల్స్, రిసార్టుల్లో ప్లేయర్లకు బస ఏర్పాటు చేశారు. అయితే ఉన్న పళంగా రైనా ఆ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. వెంటనే భారత్‌కు తిరిగి వచ్చేశాడు. రైనా వైఖరి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీనిపై రైనా వివరణ ఇస్తూ.. తన వ్యక్తిగత సమస్యల వల్లే ఈసారి టోర్నీ నుంచి తప్పుకుంటున్నా.. అని చెప్పాడు. కానీ అక్కడ జరిగింది వేరే.. అని తెలిసింది.
రైనాకు ఇచ్చిన హోటల్ గది నచ్చలేదని, దీంతో చెన్నై టీమ్ మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదు చేశాడని, వారు సర్దుకుపోవాలని చెప్పడంతో రైనా అది నచ్చక ఐపీఎల్‌ను వీడి వచ్చేశాడని.. వార్తలు వచ్చాయి. దీనిపై స్పష్టమైన వివరాలు తెలియలేదు.
MS Dhoni : ధోనీకి అత్యంత సన్నిహితుడు అయి ఉండి కూడా..
ఇక 2021 ఐపీఎల్ రెండో భాగం కూడా దుబాయ్ లోనే జరిగింది. ఈ టోర్నీకి రైనా పూర్తిగా సిద్ధమయ్యాడు. కానీ మధ్యలో మోకాలు గాయం కారణంగా తప్పుకున్నాడు. ఆ సీజన్‌లో అతను ఆడిన మ్యాచ్ లలోనూ మెరుగైన ప్రదర్శన చేయలేదు. అసలే ముఖ్యమైన జాతీయ జట్టులో లేడు, పైగా గాయాలు, వివాదాలు.. ఇన్ని సమస్యలు ఉన్నాయి కనుకనే చెన్నై అతన్ని వద్దనుకుంది. అతని వల్ల జట్టు కష్టాలు పడితే చూడలేమని, అందుకనే అతన్ని కొనలేదని.. జట్టు సీఈవోనే వెల్లడించారు. అయితే ధోనీకి అత్యంత సన్నిహితుడు అయి ఉండి కూడా చెన్నై టీమ్‌లోకి రైనా మళ్లీ రాకపోవడం అందరినీ షాక్‌కు గురి చేసింది.
రైనా గత సీజన్లలో ప్రవర్తించిన తీరు కారణంగానే అతనికి, ధోనీకి మధ్య మనస్ఫర్థలు వచ్చాయని సమాచారం. అందుకనే రైనాను మళ్లీ కొనుగోలు చేసే విషయంలో ధోనీ సైలెంట్‌గా ఉన్నాడని, అందువల్లే చెన్నై టీమ్ కూడా అతన్ని లైట్ తీసుకుందని తెలుస్తోంది. అలాగే అప్పట్లో అంటే భారత జట్టుకు ధోనీ కెప్టెన్‌గా ఉన్నాడు కనుక, అతని మాట బాగా చెల్లింది కనుక రైనా ఫామ్‌లో లేకపోయినా జట్టులోకి ధోనీ రికమండేషన్‌తో చాలా సార్లు వచ్చాడు. కానీ ఇది ఐపీఎల్.. ఫ్రాంచైజీలు ప్లేయర్ల విషయంలో నిక్కచ్చిగా ఉంటాయి. కోట్ల రూపాయలు వెచ్చించి ఆటగాళ్లను కొనుగోలు చేస్తారు కనుక వారిపై జట్టుకు అంచనాలు ఉంటాయి. అందుకు తగినట్లుగా ఆడాల్సి ఉంటుంది. కనుక ఈ విషయంలో ఎవరి రికమండేషన్‌లు పనిచేయవు. అందువల్లే ధోనీ ఈ విషయంలో సైలెంట్‌గా ఉన్నాడని, కనుకనే చెన్నై టీమ్ కూడా రైనాను కొనుగోలు చేయకుండా పక్కన పెట్టేసిందని తెలుస్తోంది. మరి రైనా భవిష్యత్తు ఏమవుతుందో చూడాలి.