Wheat Halwa : గోధుమపిండితో మనం చపాతీ. రోటి వంటి వాటి తయారు చేసుకుని తింటూ ఉంటాం. గోధుమపిండితో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వాటిని తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఇవే కాకుండా గోధుమపిండితో మనం తీపి వంటకాలను కూడా తయారు చేసుకోవచ్చు. గోధుమపిండితో చేసుకోదగిన తీపివంటకాల్లో గోదుమపిండి హల్వా కూడా ఒకటి. గోధుమపిండి, బెల్లం కలిపి చేసే ఈ హల్వా చాలా రుచిగా ఉండడంతో పాటు దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఎంతో రుచిగా ఉండే గోధుమపిండి హల్వాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమపిండి హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమ పిండి – ఒక కప్పు, బెల్లం తురుము – ఒక కప్పు, నెయ్యి – అర కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్, నీళ్లు – రెండు కప్పులు.
గోధుమపిండి హల్వా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బెల్లం, నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత ఆ నీటిని వడకట్టుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక గోధుమపిండి వేసి కలపాలి. గోధుమపిండిని పచ్చి వాసన పోయి కొద్దిగా రంగు మారే వరకు వేయించాలి. ఇలా వేయించిన తరువాత ముందుగా సిద్దం చేసుకున్న బెల్లం నీటిని కొద్దిగా పోసి కలపాలి. దీనిని దగ్గర పడే వరకు వేయించిన తరువాత మిగిలిన బెల్లం నీటిని పోసి కలపాలి. తరువాత దీనిని దగ్గర పడే వరకు వేయించిన తరువాత యాలకుల పొడి వేసి కలపాలి. దీనిని మరో పది నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తరువాత ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన గిన్నెలోకి లేదా ప్లేట్ లోకి తీసుకోవాలి. పైన అంతా సమానంగా చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత దీనిని మరో ప్లేట్ లోకి తీసుకుని ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమపిండి హల్వా తయారవుతుంది. దీనిని తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు ఇలా గోధుమపిండితో రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా హల్వాను తయారు చేసుకుని తినవచ్చు.