Wheat Paratha : గోధుమ పిండితో చపాతీలే కాకుండా రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. గోధుమపిండితో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. అలాగే వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. గోధుమపిండితో మనం ఎంతో రుచిగా ఉండే పరోటాలను కూడా తయారు చేసుకోవచ్చు. సాధారణంగా పరోటాను మైదా పిండితో తయారు చేస్తారు. మైదా పిండి పరోటాలు రుచిగా ఉన్నప్పటికి వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అదే రుచితో గోధుమపిండితో కూడా మనం పరోటాలను చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. గోధుమపిండితో పరోటాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమపిండి పరోటా తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమ పిండి – రెండు కప్పులు, ఉప్పు – తగినంత, నూనె – 2 టీ స్పూన్స్, కోడిగుడ్డు – 1, కాచి చల్లార్చిన పాలు – తగినన్ని.
గోధుమ పిండి పరోటా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. తరువాత అందులో ఉప్పు, నూనె, కోడిగుడ్డు వేసి కలపాలి. తరువాత తగినన్ని పాలు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. తరువాత పిండిపై మూతను ఉంచి 15 నిమిషాల పాటు నాననివ్వాలి. 15 నిమిషాల తరువాత పిండిని మరోసారి కలిపి సమానంగా ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ఉండను తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ చపాతీలా వత్తుకోవాలి. తరువాత చపాతీ అంతట నూనెను రాయాలి. తరువాత పొడి గోధుమపిండిని తీసుకుని చపాతీ అంతా చల్లుకోవాలి. ఇప్పుడు చపాతీని చక్కటి చతురస్రాకారం వచ్చేలా మడుచుకోవాలి. తరువాత మరలా పొడి పిండి చల్లుకుంటూ చపాతీలా వత్తుకోవాలి. చపాతీ మరీ పలుచగా ఉండకుండా చూసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక చపాతీని వేసి అర నిమిషం పాటు రెండు వైపులా కాల్చుకోవాలి. తరువాత నూనె వేస్తూ పెద్దమంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోధమ పిండి పరోటా తయారవుతుంది. దీనిని వెజ్, నాన్ వెజ్ మసాలా కూరలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. గోధుమ పిండి పరోటాలను అందరూ ఇష్టంగా తింటారు. గోధుమపిండితో ఇలా పరోటాలను తయారు చేసుకుని తినడం వల్ల రుచిగా ఉండడంతో పాటు వీటిని ఒకటి ఎక్కువగా తిన్నా కూడా ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటుంది.