Wheat Rava Idli : ఇడ్లీ.. మనం అల్పాహారంగా తీసుకునే వంటకాల్లో ఇది ఒకటి. ఇడ్లీలను చాలా మంది ఇష్టంగా తింటారు. మనం ఇంట్లో తరచూ వీటిని తయారు చేస్తూ ఉంటాం. అలాగే హోటల్స్, బండ్ల మీద కూడా ఈ ఇడ్లీలు మనకు విరివిరిగా లభిస్తాయి. ఇడ్లీలు రుచిగా ఉన్నప్పటికి వీటిని తయారు చేసుకోవడానికి మనం పిండిని ముందే తయారు చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. అంతా సమయం లేని వారు అప్పటికప్పుడు కూడా ఎంతో రుచిగా ఉండే ఇడ్లీలను తయారు చేసుకోవచ్చు. ఈ ఇడ్లీలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఇన్ స్టాంట్ గా, అప్పటికప్పుడు రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమ రవ్వ ఇడ్లీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, శనగపప్పు – ఒక టేబుల్ స్పూన్, గోధుమ రవ్వ – ఒక కప్పు, పెరుగు – అర కప్పు, నీళ్లు – అర కప్పు, ఉప్పు – తగినంత, వంటసోడా – పావు టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, క్యారెట్ తురుము – 3 టేబుల్ స్పూన్స్.
గోధుమ రవ్వ ఇడ్లీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి వేయించాలి. తరువాత గోధుమ రవ్వ వేసి వేయించాలి. దీనిని ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో పెరుగు, నీళ్లు పోసి కలపాలి. తరువాత ఉప్పు, వంటసోడా వేసి కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు రవ్వను నానబెట్టాలి. తరువాత కొత్తిమీర, క్యారెట్ తురుము వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి. తరువాత ఇడ్లీ కుక్కర్ లో నీళ్లు పోసి మూత పెట్టి నీటిని వేడి చేయాలి. తరువాత ఇడ్లీ ప్లేట్ లను తీసుకుని వాటికి నూనె రాయాలి.
ఇప్పుడు రవ్వ మిశ్రమాన్ని ఇడ్లీలుగా వేసుకోవాలి. ఈ ఇడ్లీ ప్లేట్ లను కుక్కర్ లో ఉంచి మూత పెట్టి మధ్యస్థ మంటపై 10 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని కొద్దిగా చల్లారిన తరువాత ప్లేట్ నుండి తీసుకుని గిన్నెలో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమ రవ్వ ఇడ్లీలు తయారవుతాయి. వీటిని ఏ చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. గోధుమ రవ్వతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా ఇడ్లీలను కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ ఇడ్లీలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.