Vitamin E : మనం నిత్యం తీసుకునే ఆహారం ద్వారా మన శరీరానికి వివిధ రకాల విటమిన్లు అందుతాయి. ఈ విటమిన్లలో విటమిన్ ఇ కి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది కొవ్వులో కరిగే విటమిన్. ఇది మన దేహానికి ఒక ముఖ్యమైన యాంటీ ఆక్సీడెంట్ లా పని చేస్తుంది. ఇది శరీరంలోని కణాలను కాపాడి శరీరమంతటికీ రోగ నిరోధక శక్తిని పెంచడంలో బాధ్యత వహిస్తుంది. తరచూ స్థిరంగా విటమిన్ ఇ ని శరీరానికి అందించడం వలన వివిధ రకాల వైరస్ లతో, లోపాలతో ఇంకా జబ్బులతో పోరాడడానికి శరీర రక్షణ వ్యవస్థను బలపరుస్తుంది. ఇంకా చర్మం యొక్క సాగే గుణాన్ని పెంచి చర్మ సంరక్షణకు అలాగే చర్మంపై నిగారింపు రావడానికి సహాయపడుతుంది.
ఇంకా విటమిన్ ఇ కాలుష్య కారకాలైన యూవీ కిరణాల నుండి, దుమ్ము, ధూళి కణాల నుండి కాపాడుతుంది. అలాగే విటమిన్ ఇ ని తగిన మోతాదులో తీసుకోవడం వలన త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా చేసి చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. మొత్తంగా శరీర పనితీరుని మెరుగు పరచడంలో సహాయ పడుతుంది. దీనిలో ఉండే సహజసిద్ధమైన గుణాల వల్ల గాయాలు కూడా త్వరగా మానిపోవడానికి తోడ్పడుతుంది.
విటమిన్ ఇ తలపై చర్మంలో రక్త ప్రసరణను సాఫీగా జరిగేలా చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టు కుదుళ్లను బలపరిచి తిరిగి జుట్టు పెరగడానికి, ఆరోగ్యంగా ఉండడానికి సహాయ పడుతుంది. జుట్టుకి సహజ నిగారింపుని తీసుకొస్తుంది. ఇంకా శరీర రోగ నిరోధక శక్తిని పెంచి, గుండె జబ్బులు, వివిధ రకాల క్యాన్సర్లు, కంటి సమస్యలు, రక్తం గడ్డ కట్టకుండా చేయడం, హార్ట్ స్ట్రోక్ మొదలైన ఇబ్బందులు రాకుండా చేయడంలో కీలకంగా పని చేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే విటమిన్ ఇ మన దేహంలోని ప్రతి అవయవానికి ఉపయోగకారిగా ఉంటుంది.
ఇక విటమిన్ ఇ ఎక్కువగా లభించే వాటిలో బాదం గింజలు ఇంకా వాటి నూనె, సన్ ఫ్లవర్ గింజలు ఇంకా వాటి నూనె, కుసుమ నూనె, వేరు శనగలు మొదలైనవి ప్రముఖంగా చెప్పుకోవచ్చు. కాబట్టి తప్పకుండా మనం రోజూ తీసుకునే ఆహార పదార్థాల్లో విటమిన్ ఇ ఉండేలా చూసుకోవడం మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.