Ripen Mangoes : వేసవి కాలంలో మనకు లభించే వాటిల్లో మామిడి పండ్లు ఒకటి. వీటి రుచి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. మామిడి పండ్లను తినడం వల్ల రుచిగా ఉండడమే కాకుండా మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. మామిడి పండ్లలో మన శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు రక్త హీనతను తగ్గించడంలోనూ మామిడి పండ్లు సహాయపడతాయి. మామిడి పండ్లను తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. అంతే కాకుండా క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ పండ్లలో ఉండే పొటాషియం, మెగ్నిషియం వంటి మినరల్స్ బీపీని నియంత్రించడంతోపాటు గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. మామిడి కాయలను తినడం వల్ల మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది. మామిడి కాయలనుయ తినడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. కానీ ప్రస్తుత కాలంలో మనకు సహజ సిద్దంగా పండిన మామిడి పండ్లు లభించడం లేదు. పచ్చి మామిడి కాయలను పండ్లుగా మార్చడానికి అనేక రకాల రసాయనాలను వాడుతున్నారు. ఇలా రసాయనాలు వాడి పండ్లుగా మార్చిన మామిడి కాయలను తినడం వల్ల మేలు కలగకపోగా శరీరానికి ఎంతో హాని కలుగుతోంది.
ఇలా రసాయనాలు చల్లి మగ్గబెట్టిన మామిడి పండ్లు అంత రుచిగా కూడా ఉండవు. పచ్చి మామిడి కాయలను తీసుకుని వాటిని మనం ఇంట్లోనే సహజ సిద్దంగా మామిడి పండ్లలాగా మగ్గబెట్టుకోవచ్చు. దీనికోసం ఒక మూత ఉండే ప్లాస్టిక్ డబ్బాను కానీ, స్టీల్ డబ్బాను కానీ తీసుకోవాలి. డబ్బా అడుగు భాగంలో కొద్దిగా బియ్యాన్ని పోసి పచ్చి మామిడి కాయలను ఉంచాలి. వీటిపై మరలా బియ్యాన్ని పోయాలి. అనంతరం మళ్లీ కాయలను పెట్టాలి. ఇలా డబ్బాలో పట్టినన్ని పచ్చి మామిడి కాయలను ఉంచి వాటిపై బియ్యం పోసి గాలి తగలకుండా మూత పెట్టాలి. వీటిని కదలించకుండా 8 రోజుల పాటు పక్కన ఉంచాలి. 8 రోజుల తరువాత పచ్చి మామిడి కాయలు పండ్లుగా మారడాన్ని మనం గమనించవచ్చు. పచ్చి మామిడి కాయలను ఇలా మామిడి పండ్లలా చేసుకోవడం వల్ల రుచిగా ఉండడంతోపాటు ఆరోగ్యానికి కూడా ఎటువంటి హాని కలగదు. ఈ విధంగా మామిడిపండ్లను సహజసిద్ధంగా మగ్గబెట్టుకుని తినవచ్చు. దీంతో రుచికి ఢోకా ఉండదు. ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. పోషకాలు లభిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు.