Mustard : మన వంట గదిలో ఉండే పోపుల పెట్టెలో అనేక రకాల దినుసులు ఉంటాయి. వీటిలో ఆవాలు కూడా ఒకటి. ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆవాలు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఆవాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన వంటింట్లో అనేక రకాల దినుసులు ఉంటాయి. వీటిని ఉపయోగించి ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా మనం అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు. ఇక ఆవాలలో మెగ్నిషియం, మాంగనీస్, కాల్షియం, జింక్ వంటి మినరల్స్ తోపాటు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఉంటాయి. వీటిలో శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్లు, పీచు పదార్థాలు కూడా ఉంటాయి. ఆవాలను ఆయుర్వేదంలో ఔషధంగా కూడా ఉపయోగిస్తున్నారు.
శరీరంలో కొవ్వు పేరుకోకుండా చేయడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటి వాటితో బాధపడుతున్నప్పుడు మరుగుతున్న నీటిలో ఆవాల పొడిని వేసి గోరు వెచ్చగా చేసి తాగడం వల్ల ఆయా సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆవాలలో ఉండే సెలీనియం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఊపిరితిత్తుల సమస్యలను, వాపులను తగ్గిస్తుంది. వీటిని వంటలల్లో వాడడం వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణమవ్వడమే కాకుండా ఆకలి కూడా పెరుగుతుంది. ఆవాలను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ చురుకుగా సాగుతుంది. ఆవాలను దంచి వాపులు, నొప్పులు ఉన్న చోట పట్టు వేస్తే ఉపశమనం లభిస్తుంది.
అర బకెట్ నీళ్లలో ఒక టీ స్పూన్ ఆవ పిండిని వేసి కొద్దిసేపు పాదాలను ఉంచితే పాదాల నొప్పులు తగ్గుతాయి. తెల్ల ఆవ నూనెను చర్మానికి పట్టించి నలుగు పెట్టి స్నానం చేస్తే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అదే విధంగా కొబ్బరి నూనెలో ఆవనూనెను కలిపి జుట్టుకు రాసుకోవడం వల్ల మంచిఫలితం ఉంటుంది. వీటిని అధిక మోతాదులో తీసుకోవడం వల్ల పైత్యాన్ని కలుగజేస్తాయి. కడుపులో మంట, చర్మ సంబంధమైన సమస్యలు ఉన్న వారు వీటిని తాళింపులో వాడకపోవడమే మంచిది. ముఖ్యంగా వేడి శరీరం ఉన్న వారు వీటిని పరిమిత మోతాదులోనే తీసుకోవాలి.
దంతాల నొప్పి కలిగినప్పుడు వేడి నీటిలో ఆవాలను వేసి కొద్ది సేపు ఉంచి ఆ నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించడం వల్ల దంతాల నొప్పి తగ్గుతుంది. ఆవాల పొడితో జుట్టును కడుక్కుంటే మంచి ఫలితం ఉంటుంది. ఆవాల నూనెను జుట్టుకు రాసుకోవడం వల్ల పేలు తగ్గుతాయి. ఆవాల నూనెను వాడడం వల్ల మాడు మీద కురుపులు తగ్గుతాయి. ఉబ్బసం వ్యాధి ఉన్న వారు ఆవాలను చక్కెరతో కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆవాల పిండిని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల శ్వాసకోస సంబంధమైన సమస్యలు తగ్గు ముఖం పడతాయి. మందంగా ఉన్న పులిపిర్ల మీద ఆవాలను నూరి రాస్తూ ఉండడం వల్ల పులిపిర్లు రాలి పోతాయి. ఆవాలను నూరి ఆ మిశ్రమానికి కర్పూరాన్ని కలిపి పై పూతగా రాయడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పటికీ వీటిని అల్సర్లు, మూత్ర పిండాల సమస్యలు ఉన్న వారు మాత్రం ఉపయోగించరాదని నిపుణులు చెబుతున్నారు.