Minumulu : మనం ఆహారంగా తీసుకునే పప్పు దినుసులలో మినుములు కూడా ఒకటి. మనం వంటింట్లో ఎక్కువగా ఈ మినుములను ఉపయోగిస్తూ ఉంటాం. ఉదయం అల్పాహారంలో చేసే దోశలు, ఇడ్లీలు, ఊతప్పం, వడ వంటి వాటి తయారీలో ఈ మినప పప్పునే మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. అసలు మినప పప్పు లేని వంటిల్లు ఉండనే ఉండదు అని చెప్పవచ్చు. మినుములను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. మినుముల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మినుములు మొదట వేడి చేసి తరువాత చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. శరీరానికి, మూత్రపిండాలకు బలాన్ని చేకూర్చడంలో ఇవి ఎంతగానో ఉపయోగపతాయి.
మలబద్దకం తగ్గి సుఖ విరేచనం అయ్యేలా చేయడంలో, పురుషులల్లో వీర్యవృద్ధిని కలిగించడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. మినుములు ఆలస్యంగా జీర్ణమవుతాయి. కనుక వీటిని నెయ్యి, కండచక్కెర , జీలకర్ర, అల్లం వంటి వాటితో కలిపి తీసుకోవడం వల్ల ఎటువంటి సమస్యా ఉండదు. మినప పిండితో ఇడ్లీలను వండుకుని వాటిలో సమృద్ధిగా నెయ్యిని, కండ చక్కెరను కానీ అల్లం వెల్లుల్లితో చేసిన కారాన్ని కానీ కలుపుకుని 40 రోజుల పాటు తినడం వల్ల నపుంసకత్వ తగ్గుతుంది. మినుములను దంచి జల్లించి ఆ పొడికి నెయ్యిని, చక్కెరను కలిపి సున్నుండలుగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ లడ్డూలను తినడం వల్ల మేహవాత రోగాలు తగ్గి శరీరానికి బలం చేకూరుతుంది. ఈ సున్నుండలను తినడం వల్ల పురుషులల్లో వీర్య వృద్ధి కలుగుతుంది.
నల్ల మినుములను నీటిలో నానబెట్టి మెత్తగా నూరి లేపనంగా రాస్తూ ఉండడం వల్ల బొల్లి మచ్చలు తగ్గుతాయి. మినుములను దంచి నిప్పులపై వేసి ఆ పొగను పీల్చడం వల్ల అప్పటికప్పుడు వెక్కిళ్లు తగ్గుతాయి. మినప రొట్టెను తలపై ఉంచి కట్టుగా కట్టి 2 గంటల పాటు ఉంచాలి. ఇలా చేయడం వల్ల వాత దోషం వల్ల కలిగిన తలనొప్పి తగ్గుతుంది. మినుములను, మెంతులను, ఉసిరి కాయలను సమపాళ్లలో తీసుకుని మంచి నీటితో మెత్తగా నూరి ఆ ముద్దను వెంట్రుకలకు పట్టించి బాగా ఆరిన తరువాత స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గి జుట్టు కుదుళ్లు గట్టి పడి జుట్టు బలంగా పెరుగుతుంది. కేవలం మినుములను మెత్తగా నూరి తలకు పట్టించినా కూడా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
మినుములను, ఆవాలను, చెంగల్వ కోష్టు, సైంధవ లవణాన్ని సమపాళ్లలో తీసుకుని మేక మూత్రంతో కలిపి మెత్తగా నూరాలి. దీనిని వస్త్రంలో వేసి వడకట్టి ఆ రసాన్ని రెండు చుక్కల మోతాదులో ముక్కు రంధ్రాల్లో వేసి లోపలికి పీల్చాలి. ఇలా చేయడం వల్ల తంత్ర రోగం తగ్గుతుంది. మినుములు, గోధుములు, పిప్పళ్లు, అవిసె గింజలను సమపాళ్లలో తీసుకుని పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని తగిన మోతాదులో తీసుకుని నెయ్యిని కలిపి ఒంటికి పట్టించి ఒక గంట తరువాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా కాంతివంతంగా మారుతుంది. చాలా కాలం నుండి బహిష్టు ఆగిపోయిన స్త్రీలు ప్రతిరోజూ ఆహారంలో భాగంగా మినుములను, పెరుగును, గంజిని, నువ్వులను, చేపలను తీసుకోవడం వల్ల ఆగిన బహిష్టు మరలా మొదలవుతుంది.
మేలిరకం మినప పప్పును 50 గ్రాముల మోతాదులో తీసుకుని ఒక రాత్రంతా నీళ్లల్లో నానబెట్టాలి. అలాగే వేడి నీటిలో నానబెట్టి పొట్టు తీసిన బాదం గింజలు 10, నెయ్యి 50 గ్రాములు, ఆవు పాలు 400 గ్రాములు, పటికబెల్లం 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పడు నానబెట్టిన బాదం గింజలను కొద్ది పాలలో మెత్తగా నూరాలి. ఈ మిశ్రమంతోపాటు మిగిలిన పదార్థాలన్నింటినీ కలిపి పాయసంగా చేసుకుని రోజూ ఉదయం పూట తినాలి. ఇలా 40 రోజుల పాటు చేయడం వల్ల నపుంసకత్వం పోతుంది. ఈ విధంగా మినుములను ఉపయోగించి అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.