Sugar Levels : మనల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల్లో షుగర్ వ్యాధి ఒకటి. 30 సంవత్సరాల లోపు వారు కూడా ఈ వ్యాధి బారిన పడడం మనల్ని మరింత ఆందోళనకు గురి అయ్యేలా చేస్తుంది. కారణాలేవైనప్పటికి షుగర్ వ్యాధి గ్రస్తులు జీవితాంతం మందులు మింగాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే వీరు తీసుకునే ఆహార విషయంలో కూడా అనేక జాగ్రత్తలు వహించాలి.షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవడానికి మందులను వాడడం వల్ల మనం అనేక దుష్ప్రభావాలను ఎదుర్కొవాల్సి వస్తుంది. మందులను తక్కువగా వాడుతూ కొన్ని రకాల ఆహార నియమాలను పాటించడం వల్ల షుగర్ వ్యాధిని మనం అదుపులో ఉంచుకోవచ్చు.
మనం తీసుకునే ఆహారం ద్వారా కూడా మనం షుగర్ ను అదుపులో ఉంచుకోవచ్చు. షుగర్ వ్యాధి గ్రస్తులుకు శత్రువు వంటి ఆహారాలు ఉంటాయి. అలాగే మిత్రుల వంటి ఆహారాలు ఉంటాయి. తక్కువ సమయంలో తేలికగా జీర్ణమయ్యి త్వరగా రక్తంలో కలిసే ఆహారాలన్నీ షుగర్ వ్యాధి వచ్చేలా చేస్తాయి. వీటిని శత్రువు వంటి ఆహారాలని చెప్పవచ్చు. అలాగే షుగర్ వ్యాధి పెరిగేలా చేస్తాయి. నెమ్మదిగా జీర్ణమయ్యి నెమ్మదిగా రక్తంలో కలిసే ఆహారాలన్నీ షుగర్ వ్యాధి రాకుండా చేస్తాయి. అలాగే షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచుతాయి. వీటిని మిత్రుల వంటి ఆహారాలని చెప్పవచ్చు. మనకు శక్తిని ఇచ్చే ఆహారాలు మూడు రకాలుగా ఉంటాయి. పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు.. ఈ మూడు రకాల ఆహారాలు మనకు శక్తిని ఇస్తాయి.

ఒక గ్రాము పిండి పదార్థాలు అలాగే ఒక గ్రాము మాంసకృత్తులు మనకు 4 క్యాలరీల శక్తిని అందిస్తే ఒక గ్రాము కొవ్వు పదార్థాలు మనకు 9 క్యాలరీల శక్తిని ఇస్తాయి. వీటిలో పిండి పదార్థాలు త్వరగా జీర్ణమయ్యి రక్తంలో కలిసి త్వరగా చక్కెర స్థాయిలను పెంచుతాయి. అన్నింటి కంటే ఆలస్యంగా జీర్ణమయ్యి ఆలస్యంగా రక్తంలో కలిసి ఎక్కువ సేపు శక్తిని ఇచ్చేవి కొవ్వు పదార్థాలు. పాలిష్ పట్టిన బియ్యం, రవ్వలు, మైదాపిండి, తెల్లటి రవ్వలు, ఉప్పుడు రవ్వలు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల షుగర్ స్థాయిలు మరింత పెరుగుతాయి.
కనుక పిండి పదార్థాలు తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం తగ్గించి మాంసకృత్తులు, కొవ్వులు ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల షుగర్ నియంత్రణలో ఉంటుంది. మాంసకృత్తులు, కొవ్వులు ఆలస్యంగా జీర్ణమవుతాయి. దీంతో ప్రేగుల్లో చక్కెర నెమ్మదిగా తయారవుతుంది. ఈ తయారైన చక్కెర నెమ్మదిగా రక్తంలో కలుస్తుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నియంత్రణలో ఉంటాయి. అన్నం, ఇడ్లీ, ఉప్మా వంటి పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే వాటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగతాయి. దీంతో మనం మందులను ఎక్కువగా వాడాల్సి వస్తుంది.
పల్లీలు, నువ్వులు, పచ్చి కొబ్బరి, పుచ్చ గింజల పప్పు, గుమ్మడి గింజల పప్పు, బాదం పప్పు, వాల్ నట్స్, పిస్తా పప్పు వంటివి కొవ్వు అలాగే మాంసకృత్తులు ఎక్కువగా ఉండే ఆహారాలు. వీటిని నానబెట్టుకుని రోజుకు రెండు పూటలా తినడం వల్ల అలాగే మధ్యాహ్నం వైట్ రైస్ ను తగ్గించి పుల్కా, జొన్న రొట్టె, రాగి రొట్టె వంటి వాటిని తీసుకోవాలి. ఇలా ఆహారంలో మార్పు చేసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. దీంతో మనం మందులను ఎక్కువగా వాడాల్సిన అవసరం ఉండదు.