Coriander Leaves : కొత్తిమీరను సహజంగానే చాలా మంది వంటకాలను అలంకరించేందుకు ఉపయోగిస్తారు. కొందరు దీంతో చట్నీలు కూడా చేసుకుంటారు. అయితే వంటల్లో వేసేది కదా అని కొత్తిమీరను లైట్ తీసుకోకూడదు. ఎందుకంటే దీంట్లో మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి. అలాగే అనేక అనారోగ్య సమస్యలను కూడా దీని సహాయంతో నయం చేసుకోవచ్చు.
గుండె ఆరోగ్యానికి
కొత్తిమీరలో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇది గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. అలాగే విటమిన్ బి9 (ఫోలేట్) ఎక్కువగా ఉంటుంది. దీంతో గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. హార్ట్ స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి. గుండె జబ్బులు రావు. హార్ట్ ఫెయిల్యూర్ సమస్యలు ఉత్పన్నం కావు. కొత్తిమీరలో ఉండే కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ హైపీబీని తగ్గిస్తాయి. గుండె కండరాలు వాపులకు గురి కాకుండా చూస్తాయి. దీంతో గుండె సురక్షితంగా ఉంటుంది.
విటమిన్ సి
కేవలం నిమ్మజాతి పండ్లలోనే విటమిన్ సి ఉంటుందనుకుంటే పొరపాటు. ఎందుకంటే కొత్తిమీరలోనూ విటమిన్ సి ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఒక కప్పు తాజాగా కొత్తిమీరలో సుమారుగా 79.8 మిల్లీగ్రాముల విటమిన్ సి మనకు లభిస్తుంది.
ఎముకల దృఢత్వానికి
నిత్యం 30 గ్రాముల కొత్తిమీరను తింటే మన శరీరానికి 547 శాతం విటమిన్ కె అందుతుంది. అలాగే మెగ్నిషియం, పొటాషియం, కాల్షియం వంటి మినరల్స్ కూడా అందుతాయి. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి.
చర్మ సంరక్షణకు
చర్మాన్ని సంరక్షించేందుకు కొత్తిమీర అద్భుతంగా పనిచేస్తుంది. ఇది కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్తిమీరలో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి కారణమవుతుంది. దీంతో చర్మానికి కావల్సిన తేమ అందుతుంది. చర్మం సంరక్షింపబడుతుంది. ముడతలు రాకుండా ఉంటాయి. నిత్యం 30 గ్రాముల కొత్తిమీరను తీసుకుంటే మనకు రోజుకు కావల్సిన విటమిన్ సిలో సుమారుగా 53 శాతం వరకు పొందవచ్చు.
కంటి చూపుకు
కొత్తిమీరలో లుటీన్, జియాజాంతిన్, కెరోటీన్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కళ్లలోని రెటీనాను రక్షిస్తాయి. దీంతో రెటీనా దెబ్బతినకుండా ఉంటుంది. వయస్సు మీద పడడం వల్ల వచ్చే అంధత్వం రాకుండా ఉంటుంది. కొత్తిమీరలో ఉండే విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కార్నియాను రక్షిస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. కళ్లలో ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.