సాధారణంగా ఏ కంపెనీలో అయినా కొత్తగా ఉద్యోగం చేరిన వారికి కొంత భయం ఉంటుంది. ఉన్నతోదోగ్యులు ఎవరో, ఎవరితో ఎలా మసలుకోవాలో, ఆఫీస్‌లో ఎలా ఉండాలో, అందులో రూల్స్ ఏం ఉంటాయో, ఏం పని చేయాలో, చేయకూడదో, ఎవరితో ఎలా ఉండాలో తెలియదు. ఇవన్నీ తెలిసే సరికి కొన్ని రోజుల సమయం పడుతుంది. దీంతో ఆ సమయంలోగా కొత్తగా పనిలో చేరిన వారు ఆఫీస్ వాతావరణానికి అడ్జస్ట్ అవుతారు. అయితే ఇలా కాకుండా కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు చాలా త్వరగా ఆఫీస్ వాతావరణానికి అలవాటు పడితే దాంతో వారు పని కూడా వేగంగా, మరింత సమర్థవంతంగా చేస్తారట. ఇది మేం చెప్పడం లేదు. పలు ప్రముఖ ప్రైవేటు, కార్పొరేట్ కంపెనీలే చెబుతున్నాయి. అందుకే ఆయా కంపెనీల్లో కొత్తగా ఉద్యోగంలో చేరిన వారిని పలు రకాలుగా ట్రీట్ చేస్తారు. ఆఫీస్ వాతావరణానికి త్వరగా అలవాటు పడేలా చేస్తారు. మరి ఏయే కంపెనీలు కొత్త ఉద్యోగుల పట్ల ఎలా ప్రవర్తిస్తాయో ఇప్పుడు తెలుసుకుందామా..!
బెంగళూరులోని రియల్ ఎస్టేట్ పోర్టల్ నో బ్రోకర్ సంస్థలో ఉద్యోగంలో చేరిన మొదటి రోజు సీనియర్ ఉద్యోగుల్ని పరిచయం చేసుకుని వారితో కచ్చితంగా ఓ సెల్ఫీ తీసుకోవాలని షరతు. ఇలా చేయడం వల్ల మొదట్లోనే సీనియర్స్ అంటే భయం పోతుంది. స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. దాంతోపాటే, తొలిరోజు జ్ఞాపకాలు పదిలంగా నిలిచిపోతాయి. అందుకే ఆ కంపెనీలో ఆ రూల్ పెట్టారు. అలాగే సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్‌లో కొత్త ఉద్యోగులకు తొలిరోజు ప్రత్యేకంగా రూపొందించిన ఓ టోపీని బహూకరిస్తారు. ఇక కొన్ని సంస్థల్లో టేబుల్ పైన పెట్టుకునేందుకు ఓ బెలూన్ అందిస్తారు. వీటి వల్ల, అతను కొత్త ఉద్యోగి అనే విషయం అందరికీ తెలుస్తుంది. దీంతో కొత్త ఉద్యోగిపై మొదట్లోనే పని భారం వేయరు. సాయం చేసేందుకు సీనియర్లు ముందుకొస్తారు. అలా బంధాలు బలపడతాయి. దీంతోపాటు కొత్త ఉద్యోగికి పని పట్ల ఉండే బెరుకు పోతుంది.
ఓ స్టార్టప్ కంపెనీలో కొత్త ఉద్యోగులను తొలిరోజే కనీసం 20 మంది సహోద్యోగులతో మాట్లాడి, వారికి ఇష్టమైన వంటకాల గురించీ, నచ్చిన సంగీతం గురించీ తెలుసుకోమని పురమాయిస్తారు. దీని వల్ల పక్కవారి ఇష్టాయిష్టాలు తెలుస్తాయి. స్నేహపూర్వక వాతావరణం కూడా ఏర్పడుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని వారితో స్నేహంగా మెలుగుతూ ఆఫీస్‌లో స్నేహపూర్వకంగా ఉండేందుకు ఇది తోడ్పడుతుంది. ఇక అమెజాన్, మనీటాప్ వంటి ఈ కామర్స్ సంస్థల్లో ఉద్యోగంలో చేరిన మొదటి రోజు మీ జీవితంలో ఎదుర్కొన్న ఏదైనా దుర్ఘటన గురించి కానీ, ఇబ్బందికరమైన పరిస్థితి గురించి కానీ చెప్పండి అని అడుగుతారట. దీని వల్ల ఆ ఉద్యోగికి ఎంత జ్ఞాపకశక్తి ఉందో తెలుస్తుంది.
కొన్ని సంస్థల్లో కొత్త ఉద్యోగులతో ట్రెజర్ హంట్ లాంటి ఆటలు ఆడిస్తారు. ఆఫీసులో ఓ చోట రహస్యంగా దాచిపెట్టిన వస్తువులను వెతికి పట్టుకొమ్మని చెబుతారు. ట్రెజర్ హంట్ పేరుతో ఉద్యోగులు ఆఫీసంతా తిరుగుతారు, ఫలితంగా ఆఫీసు పరిసరాల గురించీ, ఎక్కడెక్కడ ఏమేం ఉన్నాయనే దాని గురించీ మంచి అవగాహన ఏర్పడుతుంది, భవిష్యత్తులో సహోద్యోగులను అదెక్కడ? ఇదెక్కడ? అని అడిగి డిస్టర్బ్ చేయడమూ జరగదు. ఏం కావాలన్నా తమకు తామే స్వయంగా వెళ్లి తెలుసుకుంటారు. పైగా ఒక ఆఫీస్‌లో పనిచేస్తున్నప్పుడు ఎవరికైనా అందులో ఉండే అన్ని విభాగాల గురించీ పూర్తిగా తెలిసి ఉంటేనే మంచిది. కనుకనే ఇలా చేస్తారు.
పుణెలోని జాంబే అనే సంస్థలో, ఉద్యోగంలో జాయినైన మొదటిరోజే, పది మంది క్లయింట్స్ నెంబర్లు ఇచ్చి, కనీసం ఒక్కరితోనైనా అపాయింట్‌మెంట్ ఫిక్స్ చేసుకోమని చెబుతారు. అయితే కొత్తఉద్యోగులు క్లయింట్స్‌కి కాల్ చేస్తున్నప్పుడు… వారి పేర్లు, కంపెనీ ఉత్పత్తుల వివరాలను తప్పుగా చెప్పి, తికమకకు గురిచేస్తారు సీనియర్లు. ఇలా చేయడం వల్ల కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకోవాలనే ఆత్రుత కొత్త ఉద్యోగుల్లో పెరుగుతుందని ఆ కంపెనీ నమ్ముతుంది. అందుకనే ఇలా మొదటి రోజే కొత్త ఉద్యోగులను వారు తికమకకు గురి చేస్తారు. కాగా ఫర్నీచర్ తయారీ సంస్థ అర్బన్ లాడర్ వ్యవస్థాపకులు… తమ సంస్థలో కొత్తగా ఉద్యోగంలో చేరిన వారిని మీరు చూసిన సినిమాల్లో నచ్చిన డైలాగ్ చెప్పండి అని అడుగుతారట. పని భయం పోగొట్టేందుకు ఇది బాగా ఉపయోగపడుతుందట. కొత్త ఉద్యోగుల్లో ఉండే భయం పోయి వారు పనిని మరింత ప్రశాంతంగ చేసేందుకు, వారిపై ఉండే ఒత్తిడి పోయేందుకు ఇది దోహదం చేస్తుందట. ఇవీ.. ఆయా కంపెనీలు కొత్త ఉద్యోగుల పట్ల ప్రవర్తించే విధానాలు. భలే ఆశ్చర్యంగా ఉన్నాయి కదా..!