ఆరేళ్ల క్రితం గుంటూరు బృందావన్ గార్డెన్స్ లో ఒక పెళ్లికి స్థానిక మిత్రులతో కలిసి వెళ్ళాను. వేదికపై కల్యాణం జరుగుతోంది. ముహూర్తం కాగానే అతిథులందరూ క్యూ గట్టి వేదిక మీదకు వెళ్ళి ఆశీర్వదించి, భోజనం హాలుకు వెళ్తారు. ఇది మా నెల్లూరు జిల్లా సంప్రదాయం. దగ్గర బంధువులు, మిత్రులు మాత్రం వివాహం పూర్తి అయ్యేవరకు ఆసీనులై ఉంటారు. నేను మా పద్ధతి ప్రకారం కూర్చుంటారని భావించా , కానీ మిత్రులు సూటిగా భోజనాలకు దారితీశారు. భోజనం పూర్తయిన తర్వాతయినా వేదిక వద్దకు వెళ్ళి నాలుగు అక్షింతలు వేయకుండా ఇంటిదారి పట్టారు. అరే, నెల్లూరు నెరజాణలని మనకి చెడ్డ పేరు తప్ప, గుంటూరు వారు చాలా గడదేరిపోయారే అని విస్తుపోయా. ఇది యూనివర్సల్ ఫినామినన్. కాకపోవచ్చు, నా పరిమిత అనుభవం.
నేను పెళ్ళిళ్ళకు పోతే, పెళ్లి నిర్వాహకులు ఎవరైనా భోజనం, ఫలహారం చేసి పొమ్మని అటువైపుకు ఆహ్వానించక పోతే గుట్టుగా ఇంటిదారి పట్టే వాణ్ణి. ఇప్పుడు మా జిల్లాలో కూడా ముహూర్తం టైముకి వెళ్ళడం, ఆత్మీయులు అయితే వేదిక మీదకు వెళ్ళి నాలుగు అక్షింతలు వేసి ఆశీర్వదించి, భోజనశాలకు వెళతారు.
అయినా ఆహ్వానాలు కరపత్రాలు పంచినట్లు పంచుకున్నారు, ఇదీ ఒక వేలంవెర్రి. పెళ్లి ఎంత ప్రైవేటుగా, పరిమితంగా జరుపుకుంటే అంత బాగుంటుంది కదా. Display of wealth కి అవకాశంగా ఉపయోగించుకుంటున్నారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా మధ్యతరగతి ప్రజలు కూడా పై వర్గాల వారిని అనుకరిస్తూన్నారు.