అరుణాచలంలో వ్యాపార బోర్డులు అన్నీ ప్రముఖంగా తమిళం లోనే ఉండాలని,తెలుగులో ఉండకూడదని, ఉన్నా సన్నగా క్రింద ఉండాలని, ఆ తిరువణ్ణామలై జిల్లా కలెక్టర్ ఆర్డర్ పాస్ చేశారట. అరుణాచలం ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. ఎన్నో రాష్ట్రాలనుండి అరుణాచలేశ్వరుడిని సందర్శించడానికి ఎంతో మంది సందర్శించే టూరిస్ట్ ప్రదేశం. అలాంటిది ఇలా వారి తమిళం తప్ప వేరే ఏ ఇతర భాషలు ఉండకూడదంటే ఎలా? పూర్తిగా తమిళంలో ఉన్న బోర్డులను చూస్తే మీకేమైనా అర్ధం అవుతుందా? ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తమిళ భాషపై అతిశయించిన అభిమాన ఫలితమిది అని నాకనిపిస్తుంది. మా చిన్నప్పుడు సినిమా హీరోలు ANR, NTR ల అభిమానుల అభిమానం ఎంతగా అంటే, రెండవవారి కొత్త సినిమాల రిలీజు అప్పుడు వారి వాల్ పోస్టర్లు పై పేడ కొట్టేవారు. వారి హద్దులు దాటిన అభిమానం దురభిమానంగా పరిణమించింది.
ఈ స్వీయ భాషాభిమానం కూడా ఇలా దురభిమానంగా పరిణమించకుండా చూడవలసిన బాధ్యత అక్కడి రాజకీయ నాయకులందరిపై ఉంది. ఇటీవల నేను గమనించిన ఇంకో విషయం ఏమిటంటే తమిళ నిర్మాతలు తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్న వారి తమిళ చిత్రాల పేర్లు మాత్రం తమిళ్ లో అలాగే ఉంచి విడుదల చేస్తున్నారు. ఉదాహరణకు ఇటీవల విడుదలైన తమిళ సినిమా పేర్లు చూడండి- తంగలాన్, వెట్టయన్, తండాట్టి, కంగువ, వలిమై…. మొదలైనవి. అంతేకాదు అలాంటి చాలా సినిమాల టైటిల్స్ కూడా తమిళ్ లోనే ప్రదర్శించారు. అయినా మన తెలుగు వారు ఆయా సినిమాలనేమీ నిషేధించమని అడగలేదు. ఇలాగే మహారాష్ట్ర లో మరాఠీలో మట్లాడడం నేర్చుకోలేదని, ఒకతన్ని ముక్కు చెంపలు వాయించారట!
ఇలాగా ప్రతి రాష్ట్రం వారు, వారి మాతృభాష లలోనే వ్యాపార బోర్డులు ఉండాలంటే, వారి భాషలోనే మాట్లాడితేనే అక్కడ ఉండాలంటే, మన దేశంలో అన్ని రాష్ట్రాల పరిస్థితి ఏమవుతుంది? ఒక రాష్ట్రం వారు ఇంకో రాష్ట్రానికి వెళ్లగలరా? వేరే రాష్ట్రాలలో పుణ్యక్షేత్రాలు ను దర్శించగలరా? అక్కడ ఏదైనా ఉద్యోగాలు చేయగలరా? ఇలాంటి భాషా దురభిమానంతో ఏమవుతుంది మన దేశ పరిస్థితి? ప్రతి రాష్ట్రం తమ తమ మాతృభాషతోబాటుగా , మిగిలిన రాష్ట్రాల భాషలలో కూడా నోటీస్ బోర్డ్ లలో తగు స్థానం కల్పిస్తే, కనీసం టూరిజం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో, బస్ స్టాండు లు, రైల్వే స్టేషన్లలో ఉంటేనే అన్ని రాష్ట్రాల ప్రజలకు మేలు కదా అని నా భావం.