Billa Ganneru : మనం అందం కోసం ఇంటి పెరట్లో, ఇంటి ముందు రకరకాల పూల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల మొక్కల్లో బిళ్ల గన్నేరు మొక్క కూడా ఒకటి. ఈ మొక్క జీవితకాలం ప్రతిరోజూ పూలు పూస్తూ ఉంటుంది. కాబట్టి దీనిని నిత్యపుష్పి, సదా పుష్పి అనే పేర్లతో పిలుస్తూ ఉంటారు. సంస్కృతంలో దీనిని నిత్య కళ్యాణి అనే పేరుతో పిలుస్తారు. ఈ మొక్కను ఉపయోగించడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని, దీనిలో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బిళ్ల గన్నేరు మొక్క వల్ల కలిగే ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాన్సర్ బాధితులకు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని భయపడే వారికి ఈ మొక్క శ్రీరామరక్ష లాటింది. ఈ మొక్క ప్రధానంగా యాంటీ క్యాన్సర్, యాంటీ ట్యూమర్ గుణాలను కలిగి ఉంటుంది. అధిక రక్తపోటు, ముక్కు నుండి రక్తం కారడం, దంతాలు మరియు చిగుళ్ల నుండి రక్తం కారడం, నోట్లో పుండ్లు పడడం, గొంతు రాసుకుపోవడం వంటి సమస్యలను కూడా బిళ్ల గన్నేరు మొక్క సమర్థవంతంగా నివారిస్తుంది. అంతేకాకుండా పురుగులు, కీటకాలు కుట్టిన చోట బిళ్ల గన్నేరు ఆకులను పేస్ట్ గా చేసి రాయడం వల్ల ఎర్రదనం, వాపు వంటివి తగ్గుతాయి. కందిరీగ కుట్టిన చోట, పాము కుట్టిన చోట బిళ్ల గన్నేరు మొక్క ఆకులను పేస్ట్ గా చేసి రాయడం వల్ల విషం కొంత వరకు విరుగుడవుతుంది. అదే విధంగా ఫంగస్ వల్ల వచ్చే వ్యాధులు, చర్మంపై దురద ఉన్న చోట ఈ బిళ్ల గన్నేరు ఆకులను బాగా నూరి పేస్ట్ లా చేసి రాస్తే తగ్గుతాయి.

ప్రస్తుత కాలంలో అందరిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో షుగర్ వ్యాధి ఒకటి. బిళ్ల గన్నేరు మొక్క వేరును ఉపయోగించి షుగర్ వ్యాధిని నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు.దీని కోసం ముందుగా బిళ్ల గన్నేరు మొక్క వేరును తీసుకుని దానిని శుభ్రంగా కడిగి ముక్కలుగా చేయాలి. తరువాత ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక ముందుగా శుభ్రపరుచుకున్న వేరు ముక్కలను వేసి సగం గ్లాస్ నీరు అయ్యే వరకు బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఈ నీటిలో మిరియాల పొడిని వేసి కలిపి తాగాలి. ఇలా ప్రతిరోజూ తీసుకోవడం వల్ల 48 రోజుల్లో షుగర్ స్థాయిల్లో మార్పు రావడాన్ని గమనించవచ్చు.
ఇలా బిళ్ల గన్నేరు మొక్క వేరుతో చేసిన కషాయాన్ని తీసుకోవడం వల్ల మూత్ర పిండాల వాపు, మూత్ర పిండాల వ్యాధులు కూడా తగ్గిపోతాయి. అదే విధంగా 5 నుండి 10 బిళ్ల గన్నేరు పూలను తీసుకుని నీటిలో వేసి కషాయంలా చేసుకోవాలి. తరువాత ఈ కషాయాన్ని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. తరువాత అందులో మిరియాల పొడిని వేసి కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల రొమ్ము క్యాన్సర్, పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ కషాయాన్ని తాగడం వల్ల చీముతో ఉన్న మొలలు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా బిళ్ల గన్నేరు మొక్క ఆకులు, పూలతో చేసిన కషాయంతో చీముతో కూడిన మొలలను కడగాలి.
ఇలా చేయడం వల్ల మొలలు తగ్గుతాయి. ఈ మొక్క ఆకులను, పూలను నేరుగా కూడా తీసుకోవచ్చు. మూడు రోజుల పాటు ఒక్క పువ్వు, ఒక్క ఆకుతో మొదలు పెట్టి క్రమేపి వాటి సంఖ్యను పెంచాలి. ఇలా 40 రోజులు తీసుకుని మరలా 40 రోజుల పాటు విరామం ఇవ్వాలి. ఇలా సంవత్సరానికి రెండు లేదా మూడు సార్లు చేస్తే క్యాన్సర్ వస్తుందన్న భయాన్ని పక్కన పెట్టేయోచ్చు. దీనిని ఆయుర్వేద వైద్యున్ని పర్యవేక్షణలో పాటిస్తే మంచిది. అయితే గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు మాత్రం వీటిని తినకూడదు. ఈ విధంగా బిళ్ల గన్నేరు మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని వాడడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.