Kaki Donda Chettu : మనం ఆహారంగా దొండకాయలను కూడా తీసుకుంటూ ఉంటాం. దొండకాయలతో రకరకాల వంటలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. అయితే ఈ దొండకాయల్లో రెండు రకాలు ఉంటాయి. మనం ఆహారంగా తీసుకునే దొండకాయలు ఒక రకమైతే చేదు దొండకాయలని మరో రకం ఉంటాయి. ఈ చేదు దొండకాయలను కూడా చాలా మంది చూసే ఉంటారు. చేల కంచెలకు, తోటల్లో, చెట్లకు అల్లుకుని ఈ చేదు దొండ తీగ ఎక్కువగా పెరుగుతుంది. దీనిని కాకి దొండ, అడవి దొండ, చేదు దొండ అని అంటారు. ఈ కాకి దొండను సంస్కృతంలో తుండి కేరి అని హిందీలో కండారి, కుందురు అని పిలుస్తారు. ఈ కాకి దొండ కూడ మామూలు దొండ పాదులాగే ఉంటుంది. కాకి దొండలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి.
వీటిని వాడడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఆయుర్వేదంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలకు ఔషధంగా ఈ చేదు దొండను ఉపయోగిస్తారు. చేదుగా ఉన్నప్పటికి ఈ దొండకాయలతో కూరను కూడా వండుకుని తింటారు. కాకి దొండకాయలతో వండిన కూరను తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా నాడీ మండల పనితీరు మెరుగుపడి మతిమరుపు సమస్య తగ్గుతుంది. ఈ చేదు దొండను తీసుకోవడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలతో పాటు క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు కూడా మన దరి చేరకుండా ఉంటాయి. ఈ చేదు దొండకాయలను నమిలి తినడం వల్ల నోట్లో పుండ్లు, నోటి అల్సర్లు తగ్గుతాయి.
మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలతో బాధపడే వారు ఈ దొండకాయలను తినడం వల్ల రాళ్లు కరిగి మూత్రం ద్వార బయటకు పోతాయి. ఈ చేదు దొండకాయలోని గింజలను పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని ఒక గ్రాము మోతాదులో ఒక టీ స్పూన్ తేనెతో కలిపి తీసుకోవడం వల్ల వాంతులు, ఎక్కిళ్లు తగ్గుతాయి. ముఖ్యంగా ఈ తీగను షుగర్ వ్యాధి ఔషధాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. చేదు దొండ ఆకుల రసాన్ని లేదా ఈ తీగ రసాన్ని 20 గ్రాముల మోతాదులో 40 నుండి 80 రోజుల పాటు తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మధుమేహ వ్యాధి గ్రస్తులు ఈ చేదు దొండను ఉపయోగించడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు.
అంతేకాకుండా మధుమేహం వల్ల కలిగే నీరసం, అలసట తగ్గి రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఈ చేదు దొండ ఆకుల రసాన్ని గేదె పెరుగుతో కలిపి తింటూ చప్పిడి పత్యాన్ని పాటించడం వల్ల కామెర్ల వ్యాధి క్రమంగా తగ్గు ముఖం పడుతుంది. అన్ని రకాల చర్మ వ్యాధులను, దురదను, ఫంగల్ ఇన్ఫెక్షన్ లను తగ్గించడంలో కూడా ఈ చేదు దొండ తీగ మనకు ఉపయోగపడుతుంది. ఈ దొండ తీగ ఆకుల పసరును సమస్య ఉన్న చోట చర్మం పై లేపనంగా రాయడం వల్ల అన్ని రకాల చర్మ సమస్యలు తగ్గుతాయి. ఈ చేదు దొండకాయ ఆకులను, నల్ల తుమ్మ ఆకులను, చిక్కుడు ఆకులను సమానంగా తీసుకుని మెత్తగా దంచి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని అరికాళ్లపై రాయడం వల్ల అరికాళ్ల మంటలు తగ్గుతాయి.
వెల్లుల్లి రసాన్ని, ఆవపిండిని, చేదు దొండ తీగ ఆకుల రసాన్ని సమానంగా తీసుకుని మెత్తని ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండను నీటితో కలిపి తీసుకోవడం వల్ల స్త్రీలల్లో వచ్చే నెలసరి సమస్యలు, గర్భాశయ సమస్యలు తగ్గుతాయి. ఈ విధంగా చేదు దొండ తీగ మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని వాడడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.