Mutton : డయాబెటిస్ అనేది ప్రస్తుతం చాలా మందికి వస్తోంది. వంశ పారంపర్య కారణాలు లేదా క్లోమ గ్రంథి పనిచేయకపోవడం వల్ల టైప్ 1 డయాబెటిస్ వస్తుంటే.. అస్తవ్యస్తమైన జీవన విధానం వల్ల టైప్ 2 డయాబెటిస్ వస్తోంది. మొదటి దాని కన్నా రెండో రకం మధుమేహం వల్లే చాలా మంది అవస్థలు పడుతున్నారు. మన దేశాన్ని అందుకనే డయాబెటిస్ కు రాజధాని అని పిలుస్తున్నారు. అయితే డయాబెటిస్ వచ్చిన వారు అనేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పిండి పదార్థాలను తక్కువగా.. ప్రోటీన్లు ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇతర ఆహారపు అలవాట్లు.. విధానాల్లోనూ మార్పులు చేయాలి. అప్పుడే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. ఇక డయాబెటిస్ ఉన్నవారికి మాంసాహారం తినే విషయంలో అనేక సందేహాలు వస్తుంటాయి. మాంసాహారం తినాలా.. వద్దా.. తింటే మంచిదేనా ? అని అనుమానిస్తుంటారు. మరి అందుకు వైద్యులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందామా..!
డయాబెటిస్ ఉన్నవారు మాంసాహారం తినవచ్చు. అయితే కేవలం పరిమిత మోతాదులోనే తినాలి. ఎందుకంటే మాంసాహారంతో మనకు ప్రోటీన్లు లభించే మాట వాస్తవమే. కానీ వాటిలో కొవ్వు కూడా ఉంటుంది. ఇది హాని కలగజేస్తుంది. ఇక డయాబెటిస్ ఉన్నవారు అయితే మాంసాహారం అధికంగా తింటే అందులో ఉండే కొవ్వు వారికి ఇంకా నష్టం కలగజేస్తుంది. దీంతో షుగర్ లెవల్స్ మరింత పెరగడంతోపాటు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు వారికి ఎక్కువగా ఉంటాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారు మాంసాహారాన్ని పూర్తిగా మానేయాల్సిన పనిలేదు. కానీ స్వల్ప మోతాదులో తినవచ్చు.
నిపుణులు చెబుతున్న ప్రకారం.. డయాబెటిస్ ఉన్నవారు అయితే.. 15 రోజులకు ఒకసారి 75 గ్రాముల మటన్ తినవచ్చు. అది కూడా బాగా ఉడికించి.. మసాలాలు, కారం లేకుండా తినాలి. అలాగే లేత మటన్ అయి ఉండాలి. ఇక చికెన్ అయితే వారానికి ఒకసారి అంతే మోతాదులో తినవచ్చు. అదే చేపలు, సముద్రపు ఆహారాలు అయితే వారంలో 2 సార్లు తినవచ్చు. కానీ 75 గ్రాముల మోతాదుకు మించరాదు. ఇలా డయాబెటిస్ ఉన్నవారు కూడా ఎలాంటి భయం చెందకుండా మాంసాహారాన్ని తక్కువ పరిమాణంలో అప్పుడప్పుడు తినవచ్చు. దీంతో ఎలాంటి దుష్ప్రభావాలు కలగవు. అయితే షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో లేనివారు మాత్రం మాంసాహారాన్ని మానేస్తేనే మంచిది. మళ్లీ కంట్రోల్‌లోకి వచ్చాక మాంసాహారాన్ని తినవచ్చు.