Chewing Gum : చూయింగ్ గమ్‌ను నమలడం అంటే.. కొందరికి సరదా.. కొందరు చాకెట్లను తినలేక వాటిని టైమ్ పాస్‌కి తింటుంటారు. ఇక కొందరు అయితే సిగరెట్లను మానేయడం కోసం చూయింగ్ గమ్ లను నమలడం అలవాటు చేసుకుంటారు. అయితే పిల్లలు మాత్రం ఎల్లప్పుడూ వాటిని తింటూనే ఉంటారు. ఈ క్రమంలోనే కొన్ని సార్లు పొరపాటున వారు చూయింగ్ గమ్‌లను మింగే అవకాశాలు కూడా ఉంటాయి. దీంతో అలాంటి పరిస్థితి ఎదురైన సందర్భంలో ఎవరైనా సరే కంగారు పడతారు. పిల్లలకు ఏమైనా అవుతుందేమోనని భయపడుతుంటారు. దీంతో హుటాహుటిన హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. అయితే చూయింగ్ గమ్‌ను మింగితే ప్రమాదమని.. అలా జరిగితే అది మన జీర్ణాశయంలో 7 ఏళ్ల పాటు ఉంటుందని.. ఇప్పటికీ చాలా మంది నమ్ముతూ వస్తున్నారు. మరి దీనికి నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో.. ఇప్పుడు తెలుసుకుందామా..!
చూయింగ్ గమ్‌ను నమిలేటప్పుడు పొరపాటున మింగినా ఏమీ కాదు. ఎందుకంటే.. మన పేగుల సైజ్‌లో ఉండే విధంగానే ఆ గమ్‌లను తయారు చేస్తారు. కనుక మనం ఆ గమ్‌ను మింగినా అది మన జీర్ణవ్యవస్థలో సులభంగానే కదిలి బయటకు వస్తుంది. అంతేకానీ.. దాన్ని మింగితే అది జీర్ణాశయంలో 7 ఏళ్ల పాటు ఉంటుందనే విషయంలో ఎంత మాత్రం నిజం లేదు. అయితే చూయింగ్ గమ్‌ను మన జీర్ణవ్యవస్థ జీర్ణం చేయలేదు. అది మాత్రం వాస్తవం. కనుక ఆ గమ్ బయటకు వచ్చేందుకు కొంత సమయం పడుతుంది. సుమారు ఒక రోజు నుంచి 7 రోజుల వరకు ఆ గమ్ మన జీర్ణవ్యవస్థ నుంచి బయట వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అదే మలబద్దకం ఉన్నవారు అయితే ఆ గమ్ బయటకు రావడానికి ఇంకా ఎక్కువ సమయమే పట్టవచ్చు.
ఇక చూయింగ్ గమ్‌ను ఒకటి మింగితే అంత హాని కలగదు. కానీ ఒకేసారి నాలుగైదు తింటూ పొరపాటున మింగితే మాత్రం.. ప్రమాదమనే చెప్పాలి. ఎందుకంటే అవి జీర్ణం కావు, అంత సులభంగా బయటకు రావు. కనుక లోపల పేగులకు అడ్డం పడే అవకాశాలు ఉంటాయి. దీంతో అలాంటి పరిస్థితిలో బాధితులకు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక మలబద్దకం ఉన్నవారు అయితే అలా ఒకేసారి ఎక్కువ మొత్తంలో చూయింగ్ గమ్‌లను మింగితే పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉంటాయి. కనుక మలబద్దకం ఉన్నవారు చిన్నారులు అయినా పెద్దలు అయినా.. ఎవరైనా సరే.. అసలు చూయింగ్ గమ్‌లను నమలకపోవడమే మంచిది. ఇక చిన్నారులకు మలబద్దకం లేకపోయినా సరే.. వారు సాధారణ పరిస్థితులలోనే వాటిని మింగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కనుక చిన్నారులకు ఎట్టి పరిస్థితిలోనూ చూయింగ్ గమ్‌లను కొనివ్వరాదు. ఇస్తే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.