Heart Attack : ప్రస్తుత తరుణంలో హార్ట్ ఎటాక్‌లు అనేవి యుక్త వయస్సులో ఉన్నవారికి కూడా వస్తున్నాయి. ఒకప్పుడు కేవలం వృద్ధులకు లేదా వయస్సు మీద పడుతున్న వారికి మాత్రమే ఇవి వచ్చేవి. కానీ ప్రస్తుతం యువత హార్ట్ ఎటాక్ ల బారిన పడుతున్నారు. చిన్న వయస్సులోనే గుండె పోటు వస్తోంది. దీంతో కొందరు ఒకసారి గుండె పోటు వచ్చినప్పుడే మృత్యువాత పడుతున్నారు. అయితే చిన్న వయస్సులోనే గుండె పోటు వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి.
చాలా మంది యువత ప్రస్తుతం మితిమీరిన వ్యాయామం చేస్తున్నారు. ఆరు పలకల దేహంతో కనిపించాలని కోరుకుంటున్నారు. అందుకనే అవసరానికన్నా మించి ఎక్కువ సమయం పాటు జిమ్ లలో గడుపుతున్నారు. దీంతోపాటు చాలా మంది యువత ఆఫీసుల్లో పని ఒత్తిడికి గురవుతున్నారు. ఈ రెండు కారణాల వల్లే చాలా మందికి యుక్త వయస్సులోనే గుండె పోటు వస్తోంది. అయితే ఇవే కాదు, ఎనర్జీ డ్రింక్స్‌ను అధికంగా తాగడం వల్ల కూడా హార్ట్ ఎటాక్ లు వస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
ఎనర్జీ డ్రింక్స్‌లో అధికంగా కెఫీన్ ఉంటుంది. కొన్ని రకాల డ్రింక్స్ లో అయితే ఒక టిన్‌కు సుమారుగా 200 మిల్లీగ్రాముల మోతాదులో కెఫీన్ ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో కెఫీన్‌ను మన శరరీంలోకి ఒకేసారి పంపిస్తే దానిపై అధిక మొత్తంలో భారం పడుతుంది. ఇక కొందరైతే ఒకేసారి 3, 4 ఎనర్జీ డ్రింక్స్‌ను తాగేస్తారు. దీని వల్ల ఇంకా భారీగా కెఫీన్ మన శరీరంలో చేరుతుంది. ఈ క్రమంలోనే గుండె సంబంధ సమస్యలు వస్తాయి. అసాధారణ రీతిలో గుండె కొట్టుకుంటుంది.
శరీరంలో కెఫీన్ ఎక్కువగా చేరితే arrhythmia అనే స్థితి వస్తుంది. ఈ దశలో గుండె మరీ వేగంగా లేదా మరీ నెమ్మదిగా కొట్టుకుంటుంది. దీంతో గుండెకు, రక్త నాళాలకు మధ్య ఉండే విద్యుత్ ప్రవాహంలో తేడాలు వస్తాయి. ఈ క్రమంలో కార్డియాక్ అరెస్ట్ లేదా, హార్ట్ ఎటాక్‌లు సంభవిస్తాయి. అందుకనే యువత చాలా మంది గుండె పోటు బారిన పడుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు. ఈ మేరకు ఈ వివరాలను Anatolian Journal of Cardiology అనే జర్నల్‌లో ప్రచురించారు. అలాగే హార్వార్డ్ యూనివర్సిటీ పరిశోధకులు కూడా చెప్పారు.
కనుక గుండె పోటు రాకుండా ఉండాలంటే మూడు ముఖ్యమైన సూచనలు పాటించాలని పరిశోధకులు చెబుతున్నారు. ఒకటి ఎనర్జీ డ్రింక్స్‌కు దూరంగా ఉండడం, రెండోది పొగతాగడం, మద్యం సేవించడం మానేయడం, మూడోది ఒత్తిడిని తగ్గించుకోవడం. వీటిని పాటించడం వల్ల యుక్త వయస్సులో హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చని చెబుతున్నారు.