మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం వ్యాయామం చేయడంతోపాటు అన్ని పోషకాలు కలిగిన ఆహారాన్ని సమయానికి తీసుకోవాలి. దీంతోపాటు నిత్యం తగినన్ని గంటల పాటు నిద్ర కూడా పోవాలి. అయితే ప్రస్తుతం ఉరుకుల పరుగుల బిజీ యుగంలో చాలా మందికి నిద్ర కరువవుతోంది. దీంతో అనేక అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నట్లు అవుతోంది. ఇక నిద్ర సరిగ్గా పోకపోవడం వల్ల చాలా మందికి హార్ట్ ఫెయిల్యూర్ సమస్యలు వస్తున్నట్లు సైంటిస్టుల అధ్యయనాల్లో వెల్లడైంది.
యూకేలో 37 నుంచి 73 ఏళ్ల మధ్య ఉండే 4,08,802 మందికి సంబంధించిన వివరాలను పరిశోధకులు సేకరించారు. వారు నిత్యం ఎలాంటి ఆహారం తీసుకుంటారు, ఎన్ని గంటల పాటు నిద్ర పోతారు, ఏయే అనారోగ్య సమస్యలు ఉన్నాయి ? వంటి వివరాలను ఎప్పటికప్పుడు సేకరించి విశ్లేషించారు. దీంతో వెల్లడైందేమిటంటే.. ఆరోగ్యకరమైన నిద్ర విధానం కలిగి ఉన్నవారు.. అంటే వేళకు పడుకుని 7 నుంచి 8 గంటల పాటు నిద్ర పోయే వారికి హార్ట్ ఫెయిల్యూర్ సమస్యలు వచ్చే అవకాశాలు 42 శాతం వరకు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
ఇక నిద్ర సరిగ్గా పోని వారికి హార్ట్ ఫెయిల్యూర్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని సైంటిస్టులు గుర్తించారు. ఈ మేరకు సదరు అధ్యయనానికి చెందిన వివరాలను అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌కు చెందిన సర్క్యులేషన్ అనే జర్నల్‌లోనూ ప్రచురించారు. కాగా నిత్యం ఉదయాన్నే త్వరగా నిద్ర లేచే వారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు 8 శాతం తక్కువగా ఉంటాయిన, అదే 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోయే వారికి ఆ జబ్బులు వచ్చే అవకాశాలు 17 శాతం వరకు తక్కువగా ఉంటాయని, అలాగే పగటిపూట నిద్రపోని వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు 34 శాతం వరకు తక్కువగా ఉంటాయని కూడా సైంటిస్టులు చెబుతున్నారు.
కనుక ఎవరైనా సరే.. సైంటిస్టులు తెలిపిన విధంగా తమ నిద్ర విధానాన్ని ఆరోగ్యకరంగా ఉండేలా మార్చుకుంటే ఆయా అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.